అక్కడ వైసీపీని చావు దెబ్బ కొట్టటానికి బాబు వ్యూహం… ప్రత్యర్ధి శిబిరంలో టెన్షన్

చంద్రబాబు నాయుడు ఈ సారి ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో చక్రం తిప్పాలని చూస్తున్నారు. తన రాజకీయ జీవితం లో అడుగడుగునా అడ్డు పడుతూ, అనవసరపు ఇబ్బందులు పెడుతూ వస్తున్న పెదిరెడ్డి కుటుంబానికి చెక్ పెట్టె దిశగా చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. రాజంపేట ఎంపీ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ని ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా ఓటమిపాలు చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మరొక సారి పార్లమెంట్ లోకి అడుగు పెట్టనివ్వకూడదని చంద్రబాబు గట్టి పంతం తో ఉన్నారు.

ఆ నియోజకవర్గంలో చంద్రబాబు పట్టు కోసం ప్రయత్నించటానికి కారణం 1983లో టీడీపీ ఆవిర్భావం నుంచి రాజంపేట లోక్‌సభకు ఎనిమిదిసార్లు జరిగిన ఎన్నికల్లో రెండుసార్లు మాత్రమే టీడీపీ అభ్యర్థులు గెలుపు సాధించారు. 1984లో,1999లో టిడిపి గెలుపు సాధించగా ఆ తరువాత ఐదుసార్లు సాయిప్రతాప్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయకేతనం ఎగురవేశారు. 2014లో వైసీపీ అభ్యర్థి పీవీ మిధున్‌రెడ్డి గెలిచారు. మొదటి నుంచి ఈ నియోజకవర్గం కాంగ్రె్‌సకు కంచుకోటగా ఉంటూ వస్తోంది. జిల్లాలోని రాజంపేట, కోడూరు, రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె, పుంగనూరు నియోజకవర్గాలు ఉండడంతో గెలుపును ప్రభావితం చేసేది చిత్తూరు జిల్లా ఓటర్లే అన్న చర్చ మొదటి నుంచి వినిపిస్తోంది. 2014 ఎన్నికల్లోబీజేపీతో పొత్తు వల్ల రాజంపేట సీటు లో దగ్గుపాటి పురందేశ్వరి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి మిధున్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆనాటి ఎన్నికల్లో వైఎస్‌ సానుభూతి జోరుగా ఉండడంతో వైసీపీ అభ్యర్థికి భారీ మెజారిటీ దక్కింది. స్థానికంగా పట్టున్న తాజా మాజీ ఎంపీ మిధున్‌రెడ్డే వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ఇప్పటికే దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది.

అయితే ఈసారి సొంతంగానే టీడీపీకి పోటీ చేయాలని యోచిస్తోంది. రైల్వేకోడూరు, రాజంపేట, రాయచోటి నియోజకవర్గాల్లో బలిజ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉండడంతో ఆ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని ఈసారి పోటీ చేయించాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్‌రాయుడు పేరును పరిశీలించగా చెంగల్‌రాయుడు మాత్రం పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.తనకు ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇవ్వాలని అధినేతను కోరినట్లు తెలుస్తుంది.రాజంపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి పలుసార్లు గెలుపొందిన సాయిప్రతాప్‌ కాంగ్రె‌స్‌ను వీడి టీడీపీలో చేరిన నేపధ్యంలో ఇటీవల చంద్రబాబు, లోకేష్‌ను కలిసిన ఆయన రాజంపేట నుంచి తన అల్లుడు సాయిలోకేష్‌కు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సాయిప్రతాప్‌ కూడా బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో, స్థానికంగా పట్టున్న నేత కావటంతో ఆ పేరు ను పరిశీలిస్తునారు.

వైకాపా అభ్యర్థి రెడ్డి సామాజికవర్గం కావడంతో అదే సామాజికవర్గానికి చెందిన మరోబలమైన అభ్యర్థి పేరును కూడా పరిశీలిస్తున్నారు. కడప లోక్‌సభ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. శ్రీనివాసరెడ్డికి రాజంపేట సీటు కేటాయిస్తే ఎలా ఉంటుందన్న దానిపై అధిష్ఠానం పలువురి నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. చంద్రబాబు అభ్యర్థి విషయంలో సీరియస్ గా ఉండటంతో అక్కడ వైసీపీ అభ్యర్థికి టెన్షన్ పట్టుకుంది.

Facebook Comments