కేసీఆర్ కు షాక్ ఇచ్చిన మరో ఎమ్మెల్యే.. కారు దిగి కాంగ్రెస్ లో చేరిక

తెలంగాణ తొలి అసెంబ్లీని ర‌ద్దు చేసి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ళటానికి జంబో అభ్యర్థుల జాబితా ప్రకటించిన కేసీఆర్ ప్రతిపక్షాలకు నిద్ర లేకుండా చేశానని అనుకున్నారు. కానీ అసమ్మతి నేతలు పార్టీని వీడుతుండటంతో కేసీఆర్ కు నిద్ర లేకుండా అవుతుంది. తానూ అనుకున్నది ఒకటైతే అయ్యింది ఒకటి అన్న చందంగా పరిస్థితి మారింది.
ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్ రావుకు వ‌రుస‌గా షాక్‌ల మీద షాక్‌లు త‌గులుతున్నాయి. టికెట్ ఆశించి భంగ‌ప‌డ్డ నేత‌లు టీఆర్ఎస్‌కు షాక్ ఇస్తున్నారు.

కేసీఆర్ ప్ర‌క‌టించిన 105 మంది అభ్య‌ర్ధుల తొలి జాబితాలో టికెట్ ద‌క్క‌ని నేత‌లు టీఆర్ఎస్ అధిష్టానానికి పెద్ద త‌ల‌నొప్పిగా తయారయ్యారు. కొంత‌మంది నేత‌లు రెబ‌ర్స్ గా మారి టీఆర్ఎస్‌ను ఓడించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. మ‌రికొంత‌మంది ఇత‌ర పార్టీల వైపు చూస్తున్నారు. అసంతృప్తి నేత‌ల‌ను బుజ్జ‌గించేందుకు టీఆర్ఎస్ అధిష్టానం చేస్తున్న ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మ‌వుతున్నాయి. టికెట్ ద‌క్క‌ని నేత‌లు ధ‌ర్నాలు ,ఆందోళ‌న‌లు చేస్తూ టికెట్ తమకు ఇవ్వకుంటే కేసీఆర్ ప్రకటించిన టీఆర్ఎస్ అభ్య‌ర్ధుల‌ను ఓడిస్తామ‌ని హెచ్చ‌రిస్తున్నారు.

ఈ క్ర‌మంలో తాజాగా కేసీఆర్‌కు మ‌రో షాక్ త‌గిలింది. తాజాగా మ‌రో టీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్‌.రత్నం కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్నారు. ఈ మేర‌కు ఇప్ప‌టికే టీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన ఆయ‌న ,ఈనెల 27న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నారు.టీఆర్ఎస్ నుంచి టికెట్ ద‌క్క‌క‌పోవ‌డంతో స్వ‌తంత్ర అభ్య‌ర్ధిగా పోటీలోకి దిగాల‌ని మొద‌ట అయన భావించారు. కానీ ఆ త‌ర్వాత అన‌చ‌రులు, స‌న్నిహితుల నిర్ణ‌యం మేర‌కు కాంగ్రెస్‌లో చేర‌డ‌మే మంచిద‌ని నిర్ణ‌యించుకున్నారు.చేవెళ్ల టికెట్ ఇస్తామ‌ని ర‌త్నంకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఆ హామీతోనే ఆయ‌న కాంగ్రెస్‌లోకి చేరేందుకు సిద్ద‌మయ్యారు కేఎస్ రత్నం . మొత్తానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బలమైన ప్రతిపక్షం లేదని ఎవరూ పార్టీ ని వీడిపోరని భావించిన తరుణంలో బలమైన ప్రతిపక్ష కూటమి గా మహా కూటమి ఏర్పాటు జరుగుతున్న కారణంగా కారు దిగే వాళ్ళ క్యూ పెరిగిపోతుంది.

Facebook Comments