బెజ‌వాడ ప‌శ్చిమ పోరు ర‌స‌వ‌త్త‌రం: స‌ర్వేలో తేలిందేంటంటే..!

ఎన్నిక‌ల‌కు స‌మ‌యం దూసుకు వ‌స్తోంది. మ‌రో రెండు మాసాల్లోనే ఏపీ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. రేపో మాపో .. ఎన్నిక‌ల కోడ్ కూడా రానుంది. ఈ క్ర‌మంలో ఎక్క‌డెక్క‌డ ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రు ఓడుతారు? ఎవ‌రు గ‌ట్టి పోటీ ఇస్తారు? అనే విష‌యాలు కీల‌కంగా మారాయి. అదేస‌మ‌యంలో ఏ పార్టీ నాయ‌కుల‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టేందుకు అవ‌కాశం ఉంది? ప‌్ర‌జా నాడి ఎలా ఉంది? ప‌్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారు? అసలు సిట్టింగ్ ఎమ్మెల్యే ప‌రిస్థితి ఏ రేంజ్‌లో ఉంది? అవినీతి ఆరోప‌ణలు ఎలా ఉన్నాయి? వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ వ‌స్తుందా? వ‌స్తే.. గెలుస్తారా? అసలు నియోజ‌క వ‌ర్గాల్లో పార్టీ ల ప‌రిస్థితి ఏ రేంజ్‌లో ఉంది? అనే కీల‌క విష‌యాల‌పై చ‌ర్చ సాగుతోంది.

ఈ క్ర‌మంలోనే ఏపీ ఎన్నిక‌లను దృష్టిలో పెట్టుకునిఅన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను తెలుసుకునేందు కు పెద్ద‌పీట వేసింది ఏపీ ఎల‌క్ష‌న్‌ స‌ర్వే! కేవ‌లం రాజ‌కీయ ప‌రంగానే కాకుండా గ‌డిచిన ఐదేళ్ల‌లో ఆయా నియోజ‌క‌వర్గాల్లో జ‌ర‌గిన అభివృద్ధిపై కూడా ఈ స‌ర్వే దృష్టి పెట్టింది. ఏ ఎమ్మెల్యే ఎలా క‌ష్ట‌ప‌డ్డాడు. ఎలా నెట్టుకు వ‌స్తున్నాడు అనే అంశాల‌ను ప్ర‌జ‌ల నుంచే తెలుసుకుంది. ఈ క్ర‌మంలో ఆస‌క్తిక‌రంగా వ‌చ్చిన స‌ర్వే రిపోర్ట‌ను ఇప్పుడు ప్ర‌జ‌ల‌ముందు పెడుతోంది ఏపీ ఎల‌క్ష‌న్ స‌ర్వే. విష‌యంలోకి వెళ్తే.. ఏపీ ఎల‌క్ష‌న్ స‌ర్వే టీం.. ఈ క్ర‌మంలోనే రాజ‌ధాని ప్రాంతంగా ఉన్న విజ‌య‌వాడ‌పైనా ఫోక‌స్ చేసింది. దాదాపు రెండు నెల‌ల పాటు క‌ష్ట‌ప‌డి ఇక్క‌డ పరిస్థితుల‌ను అంచ‌నా వేసింది. విజ‌య‌వాడ‌లో మొత్తం మూడు నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. రాష్ట్రంలో భిన్న‌మైన వాతావ‌ర‌ణంలో ఇక్క‌డ ఎన్నిక‌ల రాజ‌కీ యాలు జ‌రుగుతుం టాయి. కులాల ప్రాతిప‌దిక‌న ఇక్క‌డ ఓటింగ్ చీలిపోతుంటుంది. దీంతో ఇక్క‌డి మూడు నియోజ‌క‌వ‌ర్గా ల్లోనూ పార్టీలు త‌మ‌దైన శైలిలో నాయ‌కుల‌కు అవ‌కాశం ఇస్తుంటాయి. ఈ క్ర‌మంలో బెజ‌వాడ ప‌శ్చిమ నియోజ‌వ‌క‌ర్గంలోనూ కులాల కుమ్మ‌లాట త‌ప్పేలా క‌నిపించ‌డం లేదు. ఇక్క‌డ మెజారిటీ ఓట్లు ముస్లింలు ఉన్నారు. దీంతో కీల‌క పార్టీల‌న్నీ దాదాపు ముస్లిం అభ్య‌ర్థుల‌కే ఇస్తున్నాయి. అలాగ‌ని కేవ‌లం ముస్లిం నేత‌లే గెలుస్తున్న దాఖ‌లాలు కూడా ఇక్క‌డ క‌నిపించ‌వు. గ‌తంలో ఇక్క‌డ నుంచి పోటీ చేసిన వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావు(వైశ్య‌) విజ‌యం సాధించారు. దీనికి ముందు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో రెండు సార్లు గెలిచారు ప్ర‌స్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్‌. ఇక్క‌డ క‌మ్యూనిస్టుల ప్ర‌భావం కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, ఇప్పుడు జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల విష‌యానికి వ‌స్తే.. టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ పోటీ భారీ ఎత్తున జ‌ర‌గ‌నుంది. అదేస‌మ‌యంలో ముస్లిం వ‌ర్సెస్ హిందూ పోరాటంగా కూడా ఇక్క‌డ ప‌రిస్థితి మారుతోంది. దీంతో విజ‌య‌వాడ‌లోని మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ నియోజ‌క‌వ‌ర్గం చాలా ఆస‌క్తిగా మారింది. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీ టికెట్‌పై జ‌లీల్‌ఖాన్ విజ‌యం సాధించి టీడీపీలోకి జంప్ చేశారు. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ ఆయ‌న త‌ప్పుకొని ఆయ‌న కుమార్తెకు క‌తూన్‌కు అవ‌కాశం ఇప్పించుకోవాల‌ని చూస్తున్నారు. అయితే, టీడీపీలోకి ఓ వ‌ర్గం దీనిని తీవ్రంగా వ్య‌తిరేకిస్తోంది. అదేస‌మ‌యంలో ముస్లింలోని ఓ వ‌ర్గం కూడా మ‌హిళ‌కు మ‌ద్ద‌తిచ్చేందుకు స‌సేమిరా అంటోంది. దీంతో ఇక్క‌డ టీడీపీ డోలాయ‌మానంలో ప‌డింది. ఎన్నిక‌ల స‌మ‌యానికి ఎవరు టీడీపీ టికెట్ కైవ‌సం చేసుకుంటార‌నేది ఆస‌క్తిగా మారింది. ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న పేరు బ‌లంగానే వినిపించినా.. ఆయ‌న స్వీయ నిర్ణ‌యంతో త‌ప్పుకొన్న‌ట్టు స‌మాచారం. దీంతో టీడీపీ అభ్యర్థి విష‌యంలో సందేహాలు కొన‌సాగుతున్నాయి. ఇక‌, వైసీపీ త‌ర‌ఫున మాజీ ఎమ్మెల్యే వెల్లంప‌ల్లి తిరిగి పోటీ చేస్తార‌ని తెలుస్తోంది. మొత్తంగా ఈ స‌ర్వేలో టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ గ‌ట్టిగా త‌ల‌ప‌డ‌నున్నాయ‌ని తెలుస్తోంది. నియోజ‌క‌వ‌ర్గంలోని హిందువుల ఓట్లు, ముస్లింల ఓట్లు ఇరు ప‌క్షాల‌కు ప‌డితే.. పోటీ తీవ్రంగా ఉండే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఏదేమైనా.. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో గెలిచే నాయ‌కుల‌కు బొటాబొటి మెజారిటీతోనే గ‌ట్టెక్కే ఛాన్స్ ఉంద‌ని తెలుస్తోంది. పూర్తిస్థాయిలో ఇక్క‌డ క్లారిటీ వ‌చ్చేందుకు కొంత స‌మ‌యం ప‌ట్టనుంది.

Facebook Comments