బాప‌ట్ల టీడీపీ టికెట్ రేసులో న‌రేంద్ర వ‌ర్మ దూకుడు…!

రాష్ట్రంలో ఎన్నిక‌ల వేడి రాజుకుంది. అధికార‌, ప్ర‌తిప‌క్షాలు రెండూ కూడా గెలుపు గుర్రాల‌ను ఎంచుకుంటున్నాయి. మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇప్ప‌టికే నిర్ణ‌యించుకున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ప్ర‌తి సీటు విష‌యంలోనూ ఆచితూచి వ్య‌వ‌హరిస్తున్నారు. ఒక‌టికి రెండు సార్లు నిఘా వ‌ర్గాల ద్వారా స‌మాచారం తెప్పించుకుని మ‌రీ వ‌డ‌పోత కార్య‌క్ర‌మం నిర్వ‌హించుకుని, అభ్య‌ర్థుల‌ను ఎంచుకుంటున్నారు. మ‌రో ఆరేడు మాసాల్లోనే ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో అభ్య‌ర్థుల ఎంపిక‌పై మ‌రింత తీవ్రంగా క‌స‌ర‌త్తు సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టికే త‌న‌సొంత జిల్లా చిత్తూరులో నాలుగుస్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను సిద్ధం చేసే ప్ర‌క్రియ‌ను ముగించారు. ప‌ల‌మ‌నేరు, చంద్ర‌గిరి, పీలేరు, న‌గ‌రిల‌పై క్లారిటీ వ‌చ్చింది. ఒక్క న‌గ‌రిలో గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు కుటుంబం నుంచి ఒక‌రికి ఇవ్వ‌నున్నారు. దీనిపై రేపో మాపో తేల్చేయ‌నున్నారు.

ఇక‌, నెల్లూరులోనూ టికెట్ల విష‌యం కొలిక్కి వ‌చ్చింది. ఆత్మ‌కూరు బొల్లినేని కృష్ణ‌య్య‌, నెల్లూరు సిటీని మంత్రి నారాయ‌ణ‌కు కేటాయించారు. ఇక‌, వైసీపీపై యుద్ధం ప్ర‌క‌టించిన బొమ్మిరెడ్డి రాఘ‌వేంద్ర‌రెడ్డిని కూడా పార్టీలోకి ఆహ్వానించి ఆయ‌న‌కు ఏదో ఒక‌ టికెట్ ఇవ్వాల‌ని దాదాపు నిర్ణ‌యాని కి వ‌చ్చారు. ప్ర‌కాశంలోనూ టికెట్ల విష‌యంపై చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో క‌స‌ర‌త్తు చేస్తున్నారు. అత్యంత కీల‌క‌మైన రాజ‌ధాని జిల్లా గుంటూరు విష‌యంలో ఒక‌టికి రెండు సార్లు చంద్ర‌బాబు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న ఐదుగురికి ఇక్క‌డ ఆయ‌న టికెట్ల‌ను క‌న్ఫ‌ర్మ్ చేశారు. అదేస‌మ‌యంలో టికెట్ల‌పై ఆశ‌లు పెట్టుకున్నా.. ఆశించిన స్థాయిలో ప‌నితీరును చూపించ‌ని మంగ‌ళ‌గిరి, మాచ‌ర్ల‌, గుంటూరు తూర్పులో ఇంచార్జుల‌కు షాక్ ఇవ్వ‌నున్నార‌ని స‌మాచారం.

ఇక‌, మ‌రో అత్య‌త కీల‌క‌మైన సీటు.. బాప‌ట నుంచి టీడీపీ టికెట్ కోసం ఇద్ద‌రు కీల‌క నాయ‌కులు త‌ల‌ప‌డుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిన అన్నం స‌తీష్‌,, తెలుగు దేశం నాయ‌కుడు, ప్ర‌ముఖ సామాజిక సేవా సంస్థ అధినేత‌ వేగేశ్న న‌రేంద్ర వ‌ర్మ‌.. బ‌రిలో ఉన్నారు. వీరు కాకుండా కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వ‌చ్చిన‌ రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన గాదె వెంక‌ట‌రెడ్డి పోటీ ప‌డుతున్నా.. రెడ్డి సామాజిక వ‌ర్గానికి ప‌ల్నాడు ప్రాంతంతో రెండు టిక్కెట్లు ఇవ్వ‌నున్న నేప‌థ్యంలో ఆయ‌న‌కు ఇక్క‌డ ఛాన్స్ ఇచ్చే అవ‌కాశం లేదు. అదేవిధంగా ఇక్క‌డ పోటీ ప‌డుతున్న అన్నం స‌తీష్ విష‌యంలోనూ బాబు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. ఆయ‌న కాపు వ‌ర్గానికి చెంద‌ని నాయకుడు కావ‌డంతో ఇప్ప‌టికే గుంటూరు వెస్ట్‌ను కాపుల‌కు ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన నేప‌థ్యంలో అన్న స‌తీష్‌కు ఆశ‌లు గ‌ల్లంతేన‌ని అంటున్నారు. పైగా ఆయ‌న ఎమ్మెల్సీ కూడా .. ఇంకా చాలా కాలం ఆయ‌న ఈ ప‌ద‌విలోనే ఉంటారు.

దీంతో ఆర్థికంగా బాలంగా ఉన్న వ‌ర్మ‌కు టికెట్ ఇవ్వ‌డ‌మే మంచిద‌ని బాబు భావిస్తున్న‌ట్టు స‌మాచారం. దీనికి సంబంధించి ఇప్ప‌టికే ప‌లు నివేదిక‌లు చంద్ర‌బాబుకు చేరాయి. ఏప‌ద‌వీ లేక‌పోయినా.. ఆయ‌న ప్ర‌జాసేవ‌లో ముందున్నారు. పైగా తాజాగా బాబు చేయించిన ఓ స‌ర్వేలో అన్నం స‌తీష్ కంటే వ‌ర్మ కేవ‌లం 1% మాత్ర‌మే వెనుక‌బ‌డి ఉన్నారు. ఇప్ప‌టికే రెండు మూడు స‌ర్వేలు చేయించిన చంద్ర‌బాబు ఈ విష‌యంలో చాలా క్లారిటీతో ఉన్నారు. పార్టీలో ఏ ప‌ద‌విలోనూ లేక‌పోయినా కూడా ఆయ‌న ఈ రేంజ్‌లో దూసుకుపోతుండ‌డం, ప్ర‌జాభిమానం సంపాయించ‌డం వంటివి చంద్ర‌బాబును బాగా ఆక‌ర్షించాయి. వ‌ర్మ‌కు త్వ‌ర‌లోనే పిలుపు రానుంది. దీనిపై ఇప్ప‌టికే జిల్లా నాయ‌క‌త్వానికి చూచాయ‌గా సంకేతాలు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికే ప‌లు కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌జ‌ల్లోకి దూసుకుపోయిన వ‌ర్మ‌.. ద‌స‌రా నుంచి మ‌రింత వినూత్నంగా దూసుకుపోయేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేప‌థ్యంలో దాదాపు బాప‌ట్ల టీడీపీ టికెట్ వ‌ర్మకే ద‌క్కుతుంద‌ని అంటున్నారు. మ‌రి ఏంజ‌రుగుతుందో చూడాలి.

Facebook Comments