ఆ మూడు రాష్ట్రాల్లో బీజేపీ కి భారీ షాక్…. ఎబీపీ సీ ఓటర్ సర్వే

దేశంలో మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న బీజేపీ కి షాక్ తగిలింది. ముందస్తు ఎన్నికలు జరుగుతున్న మూడు రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేఖ పవనాలు వీస్తాయని సి ఓటర్ సర్వే ఫలితాలు రావటంతో బీజేపీ ఖంగు తిన్నది. ఇక తెలంగాణా విషయం వేరే చెప్పనక్కరలేదు.
రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌, మిజోరాం రాష్ట్రాల ఎన్నిక‌ల‌తో పాటు తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లకు న‌గారా మోగింది.న‌వంబ‌ర్‌ లో నోటిఫికేషన్ విడుదలై డిసెంబ‌ర్‌లో ఐదు రాష్ట్రాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే 2019 లోక్‌స‌భ ఎన్నిక‌లు వ‌చ్చే ఏడాది మేలో జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌ను దేశ‌స్ధాయిలో సెమీ ఫైన‌ల్స్‌గా భావిస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాలను బట్టి కేద్రంలో అధికారంలోకి ఏ పార్టీ వస్తుందో తేలిపోనుంది.దీంతో ఈ ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌ను జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు నాలుగు నెల‌ల ముందుగా జ‌ర‌గుతున్న ఈ ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ప్ర‌భావం 2019 ఎన్నిక‌ల‌పై ఖ‌చ్చితంగా ఉంటుంది కాబట్టి చాలా వ్యూహాత్మకంగా అన్ని పార్టీలు అడుగులేస్తున్నాయి.

దేశ‌వ్యాప్తంగా మోదీ ప్ర‌భుత్వంపై రోజురోజుకు వ్య‌తిరేక‌త పెరుగుత‌న్న క్ర‌మంలో జ‌ర‌గ‌నున్న ఈ ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు బీజేపీకి పెద్ద స‌వాల్ గా మారింది. ఇటీవ‌ల ఎన్నిక‌లు జ‌రిగిన క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో బీజేపీ చావు దెబ్బ తిన‌డ‌మే కాకుండా.. అంత‌కు ముందు మోదీ సొంత రాష్ట్ర‌మైన గుజ‌రాత్ ఎన్నిక‌ల్లోనూ చావు త‌ప్పి క‌న్ను లొట్ట‌బోయిన చందంగా బీజేపీ స్వ‌ల్ప తేడాతో మాత్ర‌మే గెలుపొందింది. పెద్ద నోట్ల ర‌ద్దు, జీఎస్టీ, పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగిపోవ‌డం, మోదీ ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల‌తో రూపాయి విలువ భారీగా ప‌డిపోవ‌డం లాంటి ప‌రిణామాల‌తో జాతీయ స్ధాయిలో బీజేపీ పాలనపై నమ్మకం సడలుతుంది.

రాజ‌స్ధాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఛత్తీస్‌గఢ్ ఎన్నిక‌ల్లో బీజేపీకి భారీ షాక్ త‌ప్ప‌ద‌ని స‌ర్వేలన్నీ తేల్చిచెబుతున్నాయి. ఏబీపీ న్యూస్‌-సీవోటర్ స‌ర్వే ఫ‌లితాలలో తాజా విషయాలు వెల్లడయ్యాయి.200 అసెంబ్లీ సీట్లు ఉన్న రాజస్థాన్‌లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌ పార్టీకి 142, భాజపాకు 56 సీట్లు, మధ్యప్రదేశ్ లో మొత్తం 230 అసెంబ్లీ నియోజక వర్గాల్లో కాంగ్రెస్‌కి 122 సీట్లు భాజపాకు 108 సీట్లు వస్తాయని ఏబీపీ న్యూస్‌- సీవోట‌ర్ స‌ర్వే వెల్లడించింది. ఇక ఛ‌త్తీస్ గ‌ఢ్‌లో మొత్తం 90 అసెంబ్లీ నియోజక వర్గాల్లో కాంగ్రెస్‌కి 47, భాజపాకి 40 సీట్లు వస్తాయని తేలింది. ఇక ఓట్ల శాతం ప్ర‌కారం చూస్తే.. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ , భాజపాలకు 42.2, 41.5 శాతం చొప్పున ఓట్లు వస్తాయని, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు 38.9, బీజేపీకి 38.2 శాతం చొప్పున ఓట్లు వస్తాయని తెలిపింది. ఇక రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కి 49.9 శాతం ఓట్లు వస్తే, భాజపాకు 34.3 శాతం ఓట్లు పడనున్నాయ‌ని తెలిపింది. దీనిని బ‌ట్టి చూస్తే ప్ర‌స్తుతం బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఆ పార్టీ ఓడిపోనుంద‌ని తెలుస్తోంది. ఇక తెలంగాణలో బీజేపీ కి అసలు అంత సీనే లేదు. ఈ నేపధ్యంలో నాలుగు చోట్ల బీజేపీ కి గట్టి దెబ్బ తగలనుంది. ఇది భవిష్యత్ రాజకీయ పరిణామాలకు సంకేతం కానుంది. ఈ పరిస్థితుల్లో బీజేపీ సర్కార్ ఆందోళనలో పడింది.

Facebook Comments