డోలా స్వామి ఇది త‌గునా.. ప్ర‌శ్నిస్తే.. క‌త్తిక‌డ‌తావా..!

రాజ‌కీయాల్లో ముఖ్యంగా ప్ర‌జాస్వామ్య రాజ‌కీయాల్లో విమ‌ర్శించ‌డం, ప్ర‌శ్నించ‌డం ప‌రిపాటి. అదేస‌మ‌యంలో ప్ర‌శ్నించిన వారికి అదేస్థాయిలో స‌మాధానం చెప్ప‌డం లేదా, ఆ విమ‌ర్శ‌ల‌ను స‌రైన విధంగా తిప్పికొట్ట‌డం కూడా నాయ‌కులు చేసే ప్ర‌ధ‌మ ప‌ని! కానీ, ప్ర‌కాశం జిల్లా కొండ‌పి నియోజ‌వ‌క‌ర్గం నుంచి 2014లో టీడీపీ స్థానిక నాయ‌కుల సాయంతో విజ‌యం సాధించిన డాక్ట‌ర్ డోలా శ్రీబాల వీరాంజ‌నేయ స్వామి మాత్రం త‌న‌ను ప్ర‌శ్నించ‌డాన్ని స‌హించ‌లేక‌పోతున్నారు. త‌న‌ను ప్ర‌శ్నించ‌డాన్ని నేరంగా కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవ‌ల కాలంలో ఆయ‌న చేస్తున్న పార్టీ వ్య‌తిరేక కార్య‌క్ర‌మాలు, నియంతృత్వ పోక‌డ‌ల‌ను సొంత పార్టీ వారే అస‌హ్యించుకుంటున్నారు. ఏక‌ప‌క్షంగా ఆయ‌న చేస్తున్న ప‌నులు, తీసుకుంటున్న నిర్ణ‌యాలు కూడా తీవ్ర వివాదాస్ప‌దం అవుతున్నాయి. పార్టీలోని సీనియ‌ర్ల‌ను సైతం ఆయ‌న లెక్క‌చేయ‌డం లేదు.

దీంతో సొంత పార్టీ నుంచే తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు ఎమ్మెల్యే డోలా. చివ‌ర‌కు ఆయ‌న్ను వ్య‌తిరేకిస్తోన్న నియోజ‌క‌వ‌ర్గ కీల‌క నాయ‌కులు సైతం కొండ‌పి ప‌రిర‌క్ష‌ణ స‌మితి పేరుతో ఇటీవ‌ల స‌మావేశం ఏర్పాటు చేశారంటే పార్టీ ప‌రిస్థితి అక్క‌డ ఎంత దిగ‌జారిందో తెలుస్తోంది. అయితే, ఈ విమ‌ర్శ‌ల‌ను ఆయ‌న ప్ర‌జాస్వామ్య బ‌ద్ధంగా తిప్పికొట్టే ప్ర‌య‌త్నం చేయ‌డంలేదు. పైగా బ్లాక్ మెయిలింగ్ రాజ‌కీయాలు చేస్తూ.. నాయ‌కుల‌కు మ‌రింత కొర‌క‌రాని కొయ్య‌గా త‌యారయ్యారు. త‌న‌ను ప్ర‌శ్నించిన వారిని, త‌న ప‌నుల్లోని లోపాల‌ను ఎత్తి చూపించిన వారిని ఆయ‌న టార్గెట్ చేస్తున్నారు. “ నువ్వు న‌న్ను ప్ర‌శ్నించేవాడివా?“- అంటూ ఆయ‌న స‌ద‌రు స్థానిక సొంత పార్టీ నేత‌ల‌పైనే ఆయన ఎదురు దాడి చేస్తున్నారు. అంతేకాదు, వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ.. “వీరా పార్టీ నాయ‌కులు?!“-అనేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నిజానికి టీడీపీ అధినేత చంద్ర‌బాబు ను సైతం సొంత‌పార్టీలోని సీనియ‌ర్ నేత‌లు కూడా అప్పుడప్పుడు విమ‌ర్శిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే,వారికి న‌చ్చ‌జెప్ప‌డ‌మో.. ఆయా ప‌నుల‌పై వారికి వివ‌ర‌ణ ఇచ్చి శాంతింప‌జేయ‌డ‌మో చంద్ర‌బాబు అంత‌టి నాయ‌కులు సైతం చేస్తున్న ప‌ని. కానీ, ఎమ్మెల్యే డోలా మాత్రం అలా చేయ‌కుండా.. త‌న‌ను విమ‌ర్శించిన వారిపై క‌త్తి క‌డుతున్నారు. త‌న‌ను వేలెత్తి చూపించిన వారిని బ‌ద్నాం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న సోష‌ల్ మీడియాను విస్తృతంగా వాడుకుంటున్నారు. అదెలాగంటే.. త‌న‌ను ఎవ‌రైతే.. విమ‌ర్శిస్తున్నారో.. వారిని ప‌నిగ‌ట్టుకుని ఫాలో అవుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలోకానీ, ఏదైనా ప్రాంతంలోకానీ, వారు పాల్గొంటున్న కార్య‌క్ర‌మాల‌ను ఫాలో అవుతూ.. వారిని రాజ‌కీయంగా దెబ్బ‌కొట్టేందుకు సిద్ధప‌డుతున్నారు. నిజానికి రాజ‌కీయాల్లో ఉన్న‌ప్పుడు ఏనాయ‌కుడి ఇంట్లో కానీ, ఏదైనా సామాజిక కార్య‌క్ర‌మం నిర్వ‌హించిన‌ప్పుడు కానీ, పార్టీల‌కు అతీతంగా నాయ‌కుల‌కు ఆహ్వానాలు అందుతుంటాయి. దీంతో ఆయా కార్య‌క్ర‌మాల్లో టీడీపీ నాయ‌కులు, వైసీపీ నాయ‌కులు ఆఖ‌రుకు క‌మ్యూనిస్టు పార్టీల‌కు చెందిన వారు సైతం పాల్గొంటారు.

దీంతో ఆయా స‌మ‌యాల్లో ఆయా నాయ‌కులు క‌లిసి ఫొటోలు దిగ‌డం, మీడియాతో మాట్లాడ‌డం వంటివికూడా జ‌రుగుతుంటాయి. దీంతో ఆయా కార్య‌క్ర‌మాల్లో త‌న‌ను టార్గెట్ చేసిన‌వారు వైసీపీ నేత‌ల‌తో క‌లిసి ఉన్న ఫొటోలు, వీడియోల‌ను ఇప్పుడు డోలా త‌న‌కు అనుకూలంగా వినియోగిం చుకుంటూ… “వైసీపీ నేత‌ల‌తో కుమ్మ‌క్క‌యిన‌వారే న‌న్ను విమ‌ర్శిస్తున్నారు!“అంటూ పెద్ద ఎత్తున మొస‌లి క‌న్నీరు కారుస్తున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు కొండ‌పి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఓటీడీపీ నేత ఇటీవ‌ల డోలాను తీవ్రంగా విమ‌ర్శించారు. అయితే, ఒక కార్య‌క్ర‌మం సంద‌ర్భంలో ఆయ‌న వైసీపీ అప్ప‌టి కొండ‌పి ఇంచార్జ్ వ‌రికూటి అశోక్‌బాబుతో క‌లిసి ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఇది జ‌రిగి చాన్నాళ్లే అయింది. అయితే, డోలా ఇప్పుడు ఈ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పెట్టి నానా యాగీ చేస్తున్నారు. అదేవిధంగా బాధితులు ఎవరైనా స్థానిక నాయ‌కుల‌ను ఆశ్ర‌యించి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకోవ‌డాన్ని కూడా ఆయ‌న స‌హించ‌లేక‌పోతున్నారు. “నువ్వు ముందు వాళ్ల ద‌గ్గ‌ర‌కు వెళ్లావు క‌దా!? వెళ్లి వాళ్ల‌నే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌మ‌ను!“- అంటూ బెదిరింపు ధోర‌ణిని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లో ఓ మ‌హిళ కేన్స‌ర్‌తో బాధ‌ప‌డుతుండ‌గా ఆమె భ‌ర్త ఎమ్మెల్యే బెదిరింపు ధోర‌ణితో విసిగిపోయి.. ఒంగోలు ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్య‌క్షుడు దామ‌చ‌ర్ల జ‌నార్ద‌న్‌ను ఆశ్ర‌యించి సీఎం ఫండ్‌నుంచి నిధులు తెచ్చుకున్న ప‌రిస్థితి ఉంది. మ‌రి ఇలా చేయ‌డం ఓ ఎమ్మెల్యేగా, ఉన్న‌త విద్యావంతుడిగా.. ప్ర‌జాసేవ అయిన డాక్ట‌ర్ వృత్తి నుంచి వ‌చ్చిన నాయ‌కుడిగా డోలాకు ఎంత‌వ‌ర‌కు మంచిద‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికైనా ఆయ‌న త‌న ప‌ద్ధ‌తిని మార్చుకుంటేనే భ‌విష్య‌త్తు ఉంటుంద‌నే హెచ్చ‌రిక‌లు సైతం వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి డోలా మార‌తాడో.. ఇలా ఒంటెత్తు పోక‌డ‌లు కొన‌సాగిస్తారో చూడాలి.

Facebook Comments