ప్రభుత్వ వైఫల్యం నిజమే… సంచలన విషయాలు బయటపెట్టిన గడ్కరి..!

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సొంత బీజేపీ ప్రభుత్వాన్నే తీవ్ర ఇరకాటంలో పడేశారు. కమలనాథులపై విరుచుకుపడుతున్న కాంగ్రెస్‌ చేతికి స్వయంగా మరో అస్త్రాన్ని అందించారు. గడ్కరీ వ్యాఖ్యలతో మోదీ, అమిత్‌ షా ద్వయమే కాదు కమలదళమంతా తలలు పట్టుకుంటుంటే… కాంగ్రెస్‌ ఇదే అవకాశంగా తూర్పారబడుతోంది. ఇంతకీ గడ్కరీ ఏమన్నారు? బీజేపీ అధికారంలోకి రావడానికి ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చిందని దాపరికం లేకుండా చెప్పేశారు. ఆ హామీలు ప్రజలకు ఎన్నో ఆశలు కల్పించాయని, వాటిని నెరవేర్చే ప్రయత్నమే జరగలేదని నిష్కపటంగా ఒప్పుకున్నారు. కలర్స్‌ చానల్‌లో ప్రసారమైన ‘అసల్‌ పవానే- ఇర్సల్‌ నమూనే’ అనే రియాలిటీ షోలో గడ్కరీ, ప్రముఖ బాలీవుడ్‌ నటుడు నానా పాటేకర్‌తో కలిసి పాల్గొన్నారు. ఇందులో భాగంగా నానాతో సంభాషిస్తూ గడ్కరీ బీజేపీని ఇరకాటంలో పడేసే వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమం ఈ నెల 4, 5 తేదీల్లో రెండు భాగాలుగా ప్రసారమైంది. ‘రాజకీయాలు సినిమా కలిసిన వేళ’ పేరిట మొదటి భాగం, ‘నానా-నితిన్‌ మధ్య చమత్కారం’ పేరిట రెండో భాగం ప్రసారమయ్యాయి.

‘‘మేం అధికారంలోకి వస్తామన్న నమ్మకం లేదు. అందుకే పెద్ద పెద్ద హామీలు ఇవ్వాలని మాకు సలహా ఇచ్చారు. ఇప్పుడు మేం అధికారంలో ఉన్నాం. ప్రజలు మేం ఇచ్చిన హామీలను మాకు గుర్తు చేస్తున్నారు. మేం నవ్వి వెళ్లిపోతున్నాం’’ అని ఎన్నికల ముందు, ఇప్పటి పరిస్థితుల గురించి గడ్కరీ కుండబద్దలు కొట్టారు. ‘అధికారంలోకి రాలేదనుకోండి… ఇచ్చిన హామీలతో సంబంధమే ఉండదుగా’ అని భావించామంటూ పార్టీ ధోరణిని చెప్పకనే చెప్పారు. కానీ, ప్రజలు తమకు అధికారం కట్టబెట్టడంతో సమస్య వచ్చిపడిందని సరదాగా వ్యాఖ్యానించారు. అయితే గడ్కరీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గురించి ఈ వ్యాఖ్యలు చేశారా?, మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం గురించి చేశారా? అనే విషయంలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రజలతో పారదర్శకంగా, తెరిచిన పుస్తకంలా ఉండే పార్టీ అవసరం ఎంతో ఉందని ఓ ప్రశ్నకు బదులిచ్చారు.ఈ షోలో గడ్కరీ నర్మగర్భంగా వ్యాఖ్యలు చేయగా… లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న నానా మాత్రం ఆచితూచి స్పందించారు. కేవలం తన కుటుంబం గురించి మాట్లాడి ఊరుకున్నారు. కీలక స్థానంలో ఉన్న ఓ బీజేపీ నేత సొంత పార్టీ, ప్రభుత్వంపై విమర్శలు సంధించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో పార్టీ ఎంపీ సుబ్రమణ్యస్వామి కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర కేబినెట్‌లో ఆర్థిక శాస్త్రాన్ని అర్థం చేసుకోగలిగిన మంత్రి ఒక్కరైనా లేరని ఆయన మండిపడ్డారు.

గడ్కరీ విషయానికొస్తే… ఆయన వ్యాఖ్యలు ఉన్న వీడియోను క్లిప్‌ను కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో పోస్టు చేశారు. ‘‘నిజం చెప్పారు. బీజేపీ అధికారంలోకి రావడం కోసం తమ కలల్ని, నమ్మకాన్ని వాడుకుందని ప్రజలు కూడా భావిస్తున్నారు’’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. మోదీ ప్రభుత్వం వంచన, అబద్ధపు హామీలతో ఏర్పడిందన్న తమ అభిప్రాయంతో గడ్కరీ ఏకీభవించారని కాంగ్రెస్‌ పార్టీ మరో ట్వీట్‌లో వ్యాఖ్యానించింది.

Facebook Comments