వైఎస్ జగన్ ని వెంటాడుతున్న టేన్షన్..అసలు కారణం ఇదేనా..??

వైఎస్ జగన్ ఇప్పుడు ఎపీ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి సంచలన నిర్ణయాలు తీసుకుంటునే వున్నాడు.జగన్ దూకుడు చూస్తుంటే అయిదేళ్ల ఎన్నికల ప్రణాళిక సంవత్సరంలోపే అమలు చేసేటట్లు వున్నాడనిపిస్తుంది. అందరికీ అర్ధంకాని విషయమేమంటే ఇన్ని పధకాలు ఫాస్ట్ ట్రాక్ లో అమలుచేయటానికి కావాల్సిన డబ్బులు ఎక్కడనుంచి వస్తున్నాయనేది. ఇందులో మాయల మంత్రం ఏమీలేదు. ఉన్న డబ్బుల్లో ఒకచోటపెంచాలంటే ఇంకోచోట తగ్గించాలి. లేకపోతే అప్పన్నా తీసుకురావాలి. అయితే మనమిష్టమొచ్చినట్లు అప్పు చేయటానికి నిబంధనలు ఒప్పుకోవు. ఎఫ్ ఆర్ బి ఎం షరతులకు లోబడే అప్పులు తెచ్చుకోవాలి. రెండోది అప్పు ఇచ్చేవాడు మన ట్రాక్ రికార్డు చూస్తాడు. అది ప్రభుత్వమైనా సరే. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ బ్యాంకు ని అప్పు అడిగితే వాళ్ళు మీ ట్రాక్ రికార్డు బాగాలేదని కొర్రీ వేయటం అన్ని పేపర్లలో చూసాం.బడ్జెట్ లో కేటాయించిన నిధులు మిగతా శాఖలకు తగ్గిస్తేనే సంక్షేమ పథకాలకు తరలించొచ్చు. లేకపోతే డబ్బులు ఆకాశం నుండి ఊడిపడవుకదా. ఒక విషయం లో కొంత వెసులుబాటు వచ్చింది. చంద్రబాబు నాయుడు ఎన్నికలముందు రుణమాఫీ మొదలుపెట్టాడు.

కానీ జగన్ ఆ పధకానికి నిధులు ఆపేశాడు. అందులో కొంత నిధులు మిగిలి ఉండొచ్చు. రుణ మాఫీ పధకం దేశ ఆర్ధిక వ్యవస్థకు చేటు చేసిందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా బ్యాంకుల పాలిట శాపంగా మారింది. ఆ విధంగా చూస్తే జగన్ మొదట్నుంచి తీసుకున్న ఖచ్చితమైన వైఖరి అభినందనీయం. అయితే ఒకసారి ప్రభుత్వం మొదలుపెట్టిన తర్వాత దాన్ని మధ్యలో ఆపేస్తే రైతుల పరిస్థితి ఏంటి ? రెండు ప్రభుత్వాల మధ్య రైతు నలిగిపోతున్నాడని మరిచిపోవద్దు. ఏమైనా అది ఒక్కటే మనకు తెలిసి వెసులుబాటు వున్నది. మరి మిగతా డబ్బులు ఎలా సమకూరుస్తున్నాడంటే ఖచ్చితంగా మిగతా రంగాలకు కోత పెట్టి ఈ సంక్షేమ పథకాలకు సర్దుతున్నాడనే చెప్పాలి.అయితే ఇంత హడావుడి ఎందుకు పడుతున్నట్లు? ఇంకా నాలుగున్నర సంవత్సారాలు సమయమున్నా అన్ని వాగ్దానాలు ముందుగానే అమలుచేయాలనుకోవటం, వాగ్దానం చేసిన దానికన్నా ఎక్కువ కేటాయించటం చూస్తుంటే తనలో ఏదో ఆదుర్దా ఉందని అర్ధమవుతుంది. అన్ని పధకాలు ఇప్పుడే ఒకే సంవత్సరం లో అమలు చేయాలని అనుకోవటం వెనక ఏదో పరమార్థముందని అందరూ అనుకుంటున్నారు. వస్తున్న వార్తలను బట్టి త్వరలో సంవత్సరం లోపలే తనపై వున్న కేసుల పై తీర్పు వచ్చే అవకాశం వుంది. అదేజరిగితే శిక్షలు పడే అవకాశాన్ని కొట్టిపారవేయలేము. అటువంటప్పుడు మరలా జైలు కెళ్ళాల్సివస్తే తను చేసిన ఈ మంచి పనులే తనను ప్రజలు గుర్తుంచుకునే చేస్తాయని అనుకుంటూ వుండొచ్చు . అదే జరిగితే ఎన్నాళ్ళు జైల్లో వున్నా తిరిగి ఎన్నికలప్పటికీ తననే ఎన్నుకుంటారని అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తుంది. అందుకోసమే బయటవున్న సమయంలోనే త్వర త్వరగా అన్ని సంక్షేమ పధకాలు అమలుచేయగలిగితే ప్రజల గుండెల్లో నిలిచిపోవచ్చని అనుకుంటున్నాడు.

అంతవరకూ బాగానే ఉందికానీ మధ్యలో చిన్న తిరకాసు వచ్చింది. నిన్న ప్రారంభించిన రైతు భరోసా పధకాన్ని కేవలం రాష్ట్ర ప్రభుత్వ పధకంగానే ప్రచారం చేసుకోవాలనుకున్నాడు. అయితే బీజేపీ వాళ్ళు జగన్ పై విపరీతమైన ఒత్తిడి తెచ్చారు. ఈ పధకం లో 6000 రూపాయలు మోడీ ప్రారంభించిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నుంచి ఇస్తున్నప్పుడు కేవలం రాష్ట్రప్రభుత్వ పథకంగా ఎలా ప్రకటించుకుంటారని ప్రశ్నించారు. ఇంతలో వేమూరి రాధాకృష్ణ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ని కలవటం తో జగన్ లో కలవరం మొదలయ్యింది. ఈ సమయం లో బీజేపీ కి కోపం తెప్పించటం కొరివితో తల గోక్కున్నట్లేనని గ్రహించాడు. అందుకే చివరి క్షణం లో హడావుడిగా పధకానికి రాష్ట్ర- కేంద్ర ప్రభుత్వ సంయుక్త పథకంగా మార్పుచేసి వైస్సార్ ఫోటో తో పాటు మోడీ ఫోటోని కూడా జత చేసి ప్రకటించటం జరిగింది. కాబట్టి తన హడావుడి కి కొంత బ్రేకులు వెయ్యటం లో బీజేపీ సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు. జగన్ హడావుడి చూస్తుంటే ముందు ముందు ఏదో జరగబోతుందని అందరూ అనుకోవటంలో ఆశ్చర్యమేమీ లేదనిపిస్తుంది.

Facebook Comments