జగన్ కి మరో తలనోప్పి… ఆందోళనలో వైసీపీ

ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీతో రాజకీయ స్నేహం చేయనుండటమే ఇందుకు అసలు కారణం. ఇంతకాలం బీజేపీకి సానుకూలం అంటూ ప్రకటనలు చేసిన పవన్ కళ్యాణ్… తాజాగా ఆ పార్టీతో కలిసి ప్రజాక్షేత్రంలో పోరాటం చేయాలని నిర్ణయించుకోవడం ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారాయి. రేపు విజయవాడలో బీజేపీ, జనసేన నేతల మధ్య జరగబోయే సమావేశంలో ఇందుకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకోనుండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రాజకీయంగా ఏపీలో ఈ రెండు పార్టీలకు బలం తక్కువే అయినా… కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పవన్ కళ్యాణ్ జట్టుకట్టనుండటం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో అనే ఊహాగానాలకు ఊతమిస్తోంది.ఈ రెండు పార్టీల కలయిక వల్ల ఎవరికి లాభం కలుగుతుంది ? ఎవరికి నష్టం ఉంటుంది ? అనే చర్చ కూడా ఏపీ రాజకీయవర్గాల్లో మొదలైంది.

 

అయితే ఈ మొత్తం పరిణామాలపై ఏపీలోని అధికార వైసీపీ ఏ రకంగా రియాక్ట్ అవుతుందనే అంశంపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో వైసీపీ సత్సంబంధాలు కొనసాగిస్తోందనే ప్రచారం చాలాకాలంగా సాగుతోంది. అయితే రాష్ట్రంలో వైసీపీని బలంగా విమర్శిస్తున్న జనసేనతో బీజేపీ స్నేహం చేయనుండటంతో… దీనిపై వైసీపీ ఏ రకంగా స్పందిస్తున్నది ఆసక్తికరంగా మారింది.జనసేన తరహాలోనే బీజేపీ కూడా వైసీపీని టార్గెట్ చేసిన పక్షంలో… ఇక వైసీపీ సైతం బీజేపీని అదే స్థాయిలో విమర్శించకతప్పని పరిస్థితులు నెలకొంటాయనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే… బీజేపీని టార్గెట్ చేసే విషయంలో వైసీపీ ఏ విధంగా ముందుకు సాగుతుందనే అంశంపై భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. మొత్తానికి తమ రాజకీయ ప్రత్యర్థి అయిన జనసేనతో జట్టుకట్టబోయే బీజేపీ విషయంలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ఏ రకంగా వ్యవహరిస్తారన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.