జగన్ మళ్ళీ వేసేసారు… నమ్ముకున్న మేకపాటి హ్యాండ్ ఇచ్చేసారు

నమ్ముకున్న వారిని వాడుకుని వదిలేయడం వైసిపి అధినేత జగన్ కు వెన్నతో పెట్టిన విద్య. ఎంతమంది నేతలను అలా వాడుకుని చివరికి పెట్టేసిన ఉదంతాలు ఎన్నో. ఇప్పుడు ఆ కోవలోకే వచ్చింది నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం. ఈ జిల్లాలో వైసీపీకి అంతా తామే ఈ నడిపిన మేకపాటి ఫ్యామిలీకి తాజాగా జగన్ షాకిచ్చారు. ఆనం రామనారాయణరెడ్డి కోసం మేకపాటి రాజమోహన్‌రెడ్డికి ముఖ్య అనుచరుడు బొమ్మిరెడ్డికి అన్యాయం జరగడంతో మేకపాటి కుటుంబం మరింత కలత చెందిందని ప్రచారం. ఆయన వర్గానికి చెందిన జడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి.. వెంకటగిరిపై పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. మంగళవారం విశాఖలో జరిగిన రాష్ట్రవ్యాప్త నియోజకవర్గాల సమన్వయకర్తల సమావేశానికి రెండు రోజుల ముందే వెంకటగిరి పార్టీ సమన్వయకర్త బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిని పిలిపించుకున్నారు. ‘‘ఈ సమావేశానికి మీరు రావాల్సిన పనిలేదన్నారు.

సమన్వయకర్తల జాబితాలో మీ పేరు లేదు. ఈ సమావేశంలో మీ అవసరం ఉండదు. మీరు రావాల్సిన పని లేదు.’’ అంటూ సున్నితంగా సెలవిచ్చి సాగనంపారు. దాంతో ఖిన్నుడవడం బొమ్మిరెడ్డి వంతు అయింది. బొమ్మిరెడ్డికి ఆ విషయంతోపాటు మరో విషయం కూడా పార్టీ అధిష్ఠానం స్పష్టం చేసింది. వెంకటగిరి సమన్వయకర్తగా ఆనం రామనారాయణరెడ్డిని నియమించినట్లు తెలిపింది. రాబోయే ఎన్నికల్లో ఆయనే వెంకటగిరి అభ్యర్థి అవుతారని స్పష్టం చేసింది. ఇకపై నియోజకవర్గ బాధ్యతలు ఆనం రామనారాయణరెడ్డే చూస్తారని వివరించింది. ఆయనతో కలిసి పని చేయమని సూచించింది. ఇదే విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వివరిస్తూ సమగ్ర కథనాన్ని ప్రచురించింది. ఇప్పుడు ఇదే నిజమైంది. ఈ పరిణామాన్ని ఊహించని బొమ్మిరెడ్డి తీవ్ర అవమానంగా పరిగణిస్తున్నారు.‘‘నాలుగేళ్ల పాటు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశాను. జడ్పీ చైర్మన్‌ హోదాలో ఇటు వెంకటగిరితోపాటు అటు ఆత్మకూరు నియోజకవర్గంలోనూ పార్టీ బలోపేతానికి కృషి చేశాను. సర్వే రిపోర్టులన్నీ నాకు అనుకూలంగా వచ్చాయి. కానీ కొత్తగా వచ్చిన వ్యక్తి కోసం నన్ను బలిపశువును చేశారు. అవమానకరంగా ఇన్‌చార్జి బాధ్యతల నుంచి పక్కకు తప్పించారు.’’ అని బొమ్మిరెడ్డి తన సన్నిహితులతో ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. అధిష్ఠానం సమన్వయకర్తల సమావేశానికి రావద్దని స్పష్టం చేసిన క్రమంలో ఆయన ఆ సమావేశానికి కూడా హాజరు కాలేదు.

తనకు జరిగిన అన్యాయానికి ప్రతిగా బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి వైసీపీపై తిరుగుబాటు చేసే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు. బొమ్మికి జరిగిన అన్యాయం పట్ల వెంకటగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల పరిధిలోని ఆయన అభిమానులు, అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో బొమ్మిరెడ్డి తనకు జరిగిన అన్యాయం గురించి ప్రజలకు తెలియజేయడం కోసం పత్రికల ముందుకు రానున్నారు. తను పార్టీకి ఏం చేసింది, అధిష్ఠానం తనకు ఎలా అన్యాయం చేసింది…. అనే విషయాలను వెల్లడించడంతోపాటు రాజకీయంగా ఆయన తీసుకోబోయే నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు తెలిసింది.

Facebook Comments