జగన్ సరికొత్త ప్లాన్ బెడిసికొట్టనుందా..? రీజన్ ఇదే..?

రాబోయే ఎన్నిక‌ల్లో త‌న పార్టీని గెలిపించి త‌న‌ను ముఖ్య‌మంత్రిని చేస్తే సమస్యలను ఎలా పరిష్కరిస్తానో చెప్పాలని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మరో ప్లాన్ వేశారు. ఈ నెల 17 నుంచి రావాలి జ‌గ‌న్..కావాలి జ‌గ‌న్ అనే నినాదంతో ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు ఆయ‌న పార్టీ నాయ‌కుల‌కు ఆదేశాలిచ్చారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌తీ గ‌డ‌ప గ‌డ‌ప‌కు వెళ్లి, ప్ర‌తీ ఒక్క‌రికీ వైసీపీ న‌వ‌ర‌త్నాల గురించి తెలియజేసేందుకు ఈ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టిన‌ట్లు తెలుస్తుంది. అయితే ముఖ్యమంత్రి అవ్వాలనే కాంక్ష మినహాయించి రాష్ట్ర పరిస్థితులపై ఏ మాత్రం అవగాహన లేని జగన్ వ్యూహం బెడిసికొట్టే ప్రమాదం కూడా వుంది అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

మొదటి నుండీ జగన్ ది ఒకటే లక్ష్యం. తాను సీఎం కావటం. అందుకోసం తండ్రి తరహాలో పాదయాత్రలు, ప్రజా సంకల్ప యాత్రలు చేస్తూ ప్రజా క్షేత్రంలో తన ఇమేజ్ ను పెంచుకునే ప్రయత్నం చేశాడు జగన్. 2014 ఎన్నికల్లో జగన్ కు అసెంబ్లీ లో ప్రతిపక్ష హోదానిచ్చిన జనం కోసం జగన్ ఏమి చెయ్యలేకపోయారు. అసెంబ్లీ ని బహిష్కరించి ప్రజా సమస్యలపై గళం విప్పి సమస్యల సాధనకు ప్రయత్నించటం మానేసిన జగన్ 2019 ఎన్నికల టార్గెట్ గా ఊరూరూ తిరుగుతూ నన్ను సీఎం ను చెయ్యండి అని ప్రజలను అడుగుతున్నారు. అయితే ఒక సారి అసెంబ్లీ కి వెళ్లేందుకు వైసీపీ నాయకులను గెలిపిస్తే ఏమి చెయ్యలేకపోయారు. ఇప్పుడేమి చేస్తారు అన్న అనుమానంలో జనాలున్నారు. మరోపక్క సీఎం చంద్రబాబు ఏపీకి అన్యాయం చేసిన బీజేపీ పై యుద్ధం ప్రకటించి తన శక్తి వంచన లేకుండా రాష్ట్రాభివృద్ధి కి కృషి చేస్తున్నారు.

ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణం లో రావాలి జగన్ .. కావాలి జగన్ అంటూ ప్రచారం చెయ్యాలని సిద్ధం అయిన జగన్ ఇచ్చే హామీలు ఆచరణ సాధ్యం కానివని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు తెలుసు. దీంతో కేవలం జగన్ అధికార దాహంతోనే , సీఎం కావాలనే ఆలోచనతోనే ఈ ప్రచారం చేస్తున్నారు కానీ కనీస పాలనా నైపుణ్యం గానీ, ఆర్ధిక స్థితిగతులపై అవగాహన కానీ లేదని ప్రజలు భావిస్తున్నారు. అందుకే జగన్ ప్రచార వ్యూహం బెడిసికొట్టే ప్రమాదం కనిపస్తుంది. ఇంకోపక్క జగన్ పార్టీ నుండి వలసలు కలకలం రేపుతున్నాయి. బయటకు వెళ్ళిన వాళ్ళు చేస్తున్న బహిరంగ విమర్శలు సైతం ప్రజల్లో విస్వసనీయతకు భంగం కలిగిస్తున్నాయి. ఈ తరుణంలో జగన్ ఏదో చెయ్యబోయి ఇంకేదో చేసుకునే ప్రమాదం వుంది. మొదటికే మోసం వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. జగన్ వ్యూహాలు పార్టీ మనుగడనే ప్రశ్నార్ధకం చేసేలా వున్నాయని ముఖ్య నేతలు బాధపడుతున్నా జగన్ మాత్రం సీఎం కుర్చీ కోసం ఏదైనా చేస్తా అన్న చందంగా వ్యవహరిస్తున్నారని పార్టీలో అంతర్గత చర్చ సాగుతుంది.

Facebook Comments