వైసీపీ అధినేత జగన్ ఓ వైపు పాదయాత్ర చేస్తూనే మధ్యలో తానూ పాదయాత్ర చేస్తున్న నియోజకవర్గాలలో అశావహులకు టికెట్ ఇస్తామని ఒకప్పుడు చెప్పిన వాళ్లకు వార్నింగ్ ఇస్తున్నారు. సర్వేల పేరుతో పనితీరు బాగోలేదని ఇలా అయితే టికెట్ ఇవ్వటం కష్టం అని చెప్తున్నారు.పాదయాత్ర విరామ సమయంలో ఆయా నియోజకవర్గాల ఇన్చార్జ్లు, సిట్టింగ్లతో ఒక్కొక్కరితో వ్యక్తిగతంగా సమావేశమై వారి బలాలు, బలహీనతలపై తన నివేదిక ఇచ్చి ఇలా అయితే కష్టమే అని చెప్పటం వైసీపీ నేతల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. పార్టీ కోసం పని చేసి పార్టీ టికెట్ ఇస్తారని ఇంతకాలం కష్టపడితే టికెట్ కష్టం అని చెప్తున్న జగన్ తీరుపై అసహనం వ్యక్తం అవుతుంది.
పాదయాత్రలో ఉన్న జగన్ నరసరావుపేట లోక్సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జ్లు, ఎమ్మెల్యేలను చీపురుపల్లెకు పిలుపించుకొని మరీ వార్నింగ్ ఇచ్చారు. నరసరావుపేట ఎంపీ అభ్యర్ధిగా ఇప్పటికే మౌఖికంగా ప్రకటించిన లావు శ్రీకృష్ణదేవరాయులు మాత్రం ఈ సమావేశానికి హాజరుకాలేదు. జగన్ పిలవలేదా లేదా జగన్ పిలిచినా టికెట్ విషయం లో అసంతృప్తితో ఉన్న శ్రీకృష్ణ దేవరాయలు రాలేదా అని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి (నరసరావుపేట), పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల), ఇన్చార్జ్లు అంబటి రాంబాబు (సత్తెనపల్లి), బొల్లా బ్రహ్మనాయుడు (వినుకొండ), కాసు మహేశ్ రెడ్డి (గురజాల), కావటి మనోహర్ నాయుడు (పెదకూరపాడు) హాజరయ్యారు. జగన్తో పాటు జిల్లా ఇన్చార్జ్ బొత్స సత్యనారాయణ, సర్వే బృందాలు కూడా సమీక్షలో ఉన్నాయి. గెలుపు అవకాశాలు లేని వారిని మీ బలహీనతలను నెల రోజుల్లో సరిచేసుకుంటే సరి, లేకుంటే సీటు వేరే వారికి ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించినట్లు సమాచారం. ఒక ఇన్ఛార్జ్ని ఉద్దేశించి నీకు మాటలు ఎక్కువ, తిరుగుడు తక్కువ అని ఫైర్ అయ్యారట జగన్.
ప్రత్యర్ధి పార్టీ నాయకులను పార్టీలోకి తీసుకురాలేకపోతున్నారు. పార్టీలోని సీనియర్లను కలుపుకు పని చెయ్యలేరు. ఇలా అయితే మీకు టికెట్ ఇచ్చేది లేదని తెగేసి చెప్తున్నారు జగన్. దీంతో జగన్ తీరు పట్ల సొంత పార్టీ నాయకులే మంట మీద ఉన్నారు.