జగన్ కు తప్పని తిప్పలు..ఏపీలో ఉద్రిక్తత పరీస్థీతులు..

రాజధాని వ్యవహారం ఏపీ రాజకీయాలను అతలాకుతలం చేస్తోంది.ముఖ్యంగా ప్రతిపక్ష తెలుగుదేశం, అధికార పార్టీ వైసీపీ ఈ విషయంలో మాటల యుద్ధానికి తెరతీస్తున్నాయి.ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతిని రాజధానిగా ఉంచాలని, మరో ప్రాంతానికి తరలించడానికి కుదరదు అంటూ టిడిపి వాదిస్తుండగా, గతంలో ఏపీ, తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాదును ఇదే విధంగా అభివృద్ధి చేసి మిగతా ప్రాంతాలను పట్టించుకోక పోవడం వల్ల ఇప్పుడు ఏపీలో ఈ విధమైన పరిస్థితి వచ్చిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.అందుకే అభివృద్ధి వికేంద్రీకరణ తో పాటు పరిపాలన వికేంద్రీకరణ కూడా ఉండి తీరాల్సిందే అంటూ పట్టుబడుతోంది.

 

ఇంత వరకు బాగానే ఉన్నా మరో నాలుగేళ్ల పాటు వైసిపి అధికారంలో ఉంటుంది కాబట్టి జగన్ నిర్ణయం మేరకే మూడు ప్రాంతాల్లో రాజధాని విస్తరిస్తుంది.అయితే మూడు ప్రాంతాల్లో రాజధాని విస్తరించడం వల్ల అభివృద్ధి ఏ విధంగా చేస్తారు అనేది తేలాల్సి ఉంది.గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మాణం పూర్తి అవుతుందని అందరూ భావించారు.మొత్తం పరిపాలన కాలం అంతా డిజైన్లు మార్చడానికే చంద్రబాబు సమయం తీసుకున్నారు.దీంతో ప్రజల్లో ఒకింత ఆగ్రహం కలిగి టిడిపిని అధికారానికి దూరం చేశారు.ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతోంది.ఈ సమయంలో వేగంగా ముందుకు వెళ్లాల్సి ఉంది.అభివృద్ధిని మాత్రం రాష్ట్రమంతా ఏ విధంగా విస్తరిస్తుంది అనేది వైసిపి ముందున్న సవాల్.ప్రభుత్వంపై ప్రజల మద్దతు, వ్యతిరేకత అనేది ఆధారపడి ఉంటుంది.ముఖ్యంగా ఏపీలో పరిశ్రమలు పెట్టాలనుకునే వారికి ఉద్యోగాల కల్పనలో 75% స్థానికులకు ఇవ్వాలి అనే కండిషన్ జగన్ పెట్టడం వల్ల వారు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ కారణంగానే ఏపీకి పరిశ్రమలు పెద్ద రావడం లేదు.

 

ఇక రాజధాని విషయంలో వీలైనంత తొందరగా ఏదో ఒక నిర్ణయానికి రాకపోతే, పరిపాలన కాలం అంతా ఈ గందరగోళ పరిస్థితులను నెట్టుకు రావడానికే సరిపోతుంది తప్ప, అభివృద్ధిపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టే అవకాశం ఉండదు.అందుకే జగన్ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.