టీఆర్ఎస్ ఎన్నికల రాజకీయమా …2004లో నమోదైన కేసులో ఇప్పుడు జగ్గారెడ్డి అరెస్ట్

రాష్ట్రంలో ముందస్తుకు ముహూర్తం ఖరారవుతున్న వేళ మాజీ ఎమ్మెల్యే జాగారా అరెస్ట్ సంచలనం సృష్టించింది. ఒకవైపు గులాం నబీ ఆజాద్ సభకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో కక్షపూరితంగా జగ్గారెడ్డి అరెస్ట్ జరిగిందని ప్రతిపక్ష పార్టీ మండిపడుతుంది. మరో పక్క నకిలీ పత్రాలతో మానవ అక్రమ రవాణా చేసినట్టు అందుకు తనకు ఒక్కొక్కరి నుండి 5 లక్షల రూపాయలు ముట్టినట్టు జగ్గారెడ్డి ఒప్పుకున్నారని చెప్పటం సంచలనంగా మారింది.

2004లో నకిలీ పత్రాలు, పాస్‌పోర్ట్‌తో మానవ అక్రమ రవాణా చేసిన కేసులో అరెస్ట్ చేసిన కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై ఎనిమిది సెక్షన్ల కింద కేసులు పెట్టారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు… టాస్క్ ఫోర్స్ డీసీపీ కార్యాలయంలో 3 గంటలు పాటు జగ్గారెడ్డిని విచారించి అరెస్ట్ చేసిన పోలీసులు… గుజరాత్ కి చెందిన ముగ్గురుని తన కుటుంబ సభ్యులుగా చేర్చి అమెరికాకి తరలించినట్లు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో జగ్గారెడ్డిపై ఐపీసీ 419, 490, 467, 468, 471, 370, పాస్ పోర్ట్ యాక్ట్ సెక్షన్ 12, ఇమ్మిగ్రేషన్ యాక్ట్ 24 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. కాసేపట్లో గాంధీ ఆస్పత్రిలో జగ్గారెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపర్చనున్నారు పోలీసులు.జగ్గారెడ్డి తప్పుడు ధృవపత్రాలతో పాస్‌పోర్టుకు దరఖాస్తు చేశారని నార్త్‌జోన్‌ డీసీపీ సుమతి తెలిపారు. కుటుంబ సభ్యుల పేరుతో వేరే వ్యక్తులను విదేశాలకు పంపారని చెప్పారు. ఫేక్‌ డాక్యుమెంట్స్‌, ఫేక్‌ పాస్‌పోర్టుతో వీసాకు ధరఖాస్తు చేశారని సుమతి తెలిపారు. నాలుగేళ్ల కూతురును 17ఏళ్లుగా, నాలుగేళ్ల కొడుకును 15ఏళ్లుగా చూపించారని.. ఆధార్‌ డేటా చూస్తే నిజానిజాలు బయటపడ్డాయన్నారు. వెళ్లిన ముగ్గురు తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు కాదని తెలుస్తోందని చెప్పారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇతర వ్యక్తులను తన కుటుంబ సభ్యులగా పేర్కొంటూ లెటర్‌హెడ్ పై పాస్‌పోర్టు కోసం రిక్వెస్ట్‌ చేశారని నార్త్‌జోన్‌ డీసీపీ సుమతి తెలిపారు.

సికింద్రాబాద్‌ మార్కెట్‌ పీఎస్‌కు వచ్చిన ఫిర్యాదుతో నిశితంగా దర్యాప్తు చేశామన్నారు. 2004లో ఎమ్మెల్యేగా ఉన్న జగ్గారెడ్డి మానవ అక్రమ రవాణా చేశారని ఆధార్‌ డేటా ఆధారంగా ఈ అక్రమాలను గుర్తించినట్లు స్పష్టం చేశారు. జగ్గారెడ్డి కుటుంబ సభ్యుల ఆధార్‌ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అమెరికాకు పంపించిన నకిలీ వ్యక్తులను బ్రోకర్‌ మధు తన దగ్గరకు తీసుకొచ్చాడని ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షలు తీసుకున్నట్లు తమ విచారణలో జగ్గారెడ్డి చెప్పారన్నారు. సంగారెడ్డి లో బలమైన నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ లో కొనసాగుతున్న జగ్గా రెడ్డి అరెస్ట్ తో టీఆర్ఎస్ కాంగ్రెస్ దూకుడుకు చెక్ పెట్టె ప్రయత్నం చేస్తుందనే వాదన వినిపిస్తుంది.ఇది పక్కా ఎన్నికల రాజకీయం అని కాంగ్రెస్ మండిపడుతుంది.

Facebook Comments