జనసేన తొలి అభ్యర్థి ఓడినట్టే…ముమ్మడివరం సీటు డౌటే

జనసేనాని ఏది చేసినా సంచలనమే … ముందస్తు ఎన్నికలు వస్తున్నట్టు తెలియటంతోనే జనసేనాని పవన్ కళ్యాణ్ తమ మొదట అభ్యర్థిని ఖరారు చేశారు. ముమ్మడివరం నియోజకవర్గం నుండి పార్టీలో చేరిన నాడే అభ్యర్థిగా ప్రకటించటం ఒక సంచలన నిర్ణయం.అంతే కాదు ఒక కానిస్టేబుల్ కొడుకుగా ఎదిగిన పవన్ కళ్యాణ్ ఇచ్చిన తొలి టికెట్ కూడా రాజకీయాలపై ఆసక్తితో కానిస్టేబుల్ ఉద్యోగాన్ని వదులుకున్న బీసీ అభ్యర్థి పితాని బాలకృష్ణ కే కావటం విశేషం. పార్టీ ముఖ్యనేతలతో కూడా చర్చించకుండా పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయంపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది.

జ‌న‌సేన‌కు అంతో ఇంతో బ‌ల‌ముంద‌ని భావిస్తున్న గోదావ‌రి జిల్లాల్లోనే తొలి అభ్య‌ర్థిని ప్రకటించారు పవన్ కళ్యాణ్. అయితే గ‌తంలో ప్ర‌జారాజ్యం త‌రుపున చిరంజీవి కూడా ఇలాంటి నిర్ణ‌య‌మే తీసుకుని దెబ్బ తిన్నారు. అప్ప‌ట్లో త‌న పార్టీ త‌రుపున తొలి అభ్య‌ర్థిగా మ‌ణెమ్మ‌ను రంగంలో దింపారు.నెల్లూరు జిల్లాలో జ‌న‌ర‌ల్ సీటులో ఎస్టీ మ‌హిళ‌ల‌కు చాన్స్ ఇచ్చారు. ఆ త‌ర్వాత ఆమె ఓట‌మి పాల‌య్యింది.తాజాగా అన్న బాటలోనే తమ్ముడు కూడా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ముమ్మిడివ‌రం అసెంబ్లీనియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీలో రెండేళ్ల పాటు నియోజ‌క‌వ‌ర్గ కోఆర్డినేట‌ర్ గా ఉన్న పితాని బాల‌కృష్ణ‌కు కండువా క‌ప్పుకున్న నాడే పార్టీ అభ్య‌ర్థితిత్వం ఖార‌రు చేశారు. వైసీపీ కోసం రెండేళ్ల పాటు ప‌నిచేసిన పితానికి జగన్ పొమ్మనలేక పొగబెట్టారు. మాజీ ఎమ్మెల్యే పొన్నాడ స‌తీష్ పార్టీలో చేరిన త‌ర్వాత మ‌త్స్య‌కార సామాజిక‌వ‌ర్గం వైపు మొగ్గుచూపిన జ‌గ‌న్ , శెట్టిబ‌లిజ సామాజిక‌వ‌ర్గానికి చెందిన పితానిని ప‌క్క‌న పెట్టేశారు. దీంతో బాల‌కృష్ణ ప‌వ‌న్ ని క‌లిసి, కండువా క‌ప్పుక‌న్న నాడే పవన్ ప్రకటించిన జనసేన తొలి అభ్య‌ర్థి కాగ‌లిగారు.

అయితే ముమ్మిడివ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే దాట్లు బుచ్చిబాబు క్ష‌త్రియ సామాజిక‌వ‌ర్గానికి చెందిన నేత, ఆర్థికంగా ద‌న్ను క‌లిగిన ఉన్నారు. వైసీపీ అభ్య‌ర్థి పొన్నాడ స‌తీష్ కూడా మాజీ ఎమ్మెల్యే కావ‌డం, ఆర్థికంగా స్థిర‌మైన నేత కావ‌డం పైగా సొంత సామాజిక‌వ‌ర్గం మ‌త్స్య‌కారుల అండ వుండటం వీరికి లాభించే అంశం . దీంతో ఇక్క‌డ జ‌న‌సేన ప‌ట్టు సాధించాలంటే కాపు, శెట్టిబ‌లిజ క‌ల‌యిక తోడ్ప‌డుతుంద‌ని ప‌వ‌న్ భావించిన‌ట్టు క‌నిపిస్తోంది. అందుకే ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్.మొత్తానికి ముమ్మడివరం సీటు దక్కించుకోటానికి పితానికి అంగబలం, అర్ధబలం కావాలి. ప్రత్యర్థులతో చూసుకుంటే పితాని బలహీనంగా ఉన్నాడు. కాబట్టి జనసేన మొదటి సీటు అయిన ముమ్మడివరం సీటు డౌటే అంటున్నారు రాజకీయ వర్గాలు .

Facebook Comments