కేసీఆర్ పై గద్దర్ .. కేటీఆర్ పై విమలక్క పోటీ !

తెలంగాణాలో ఎన్నికల వేడి మాములు రేంజ్ లో లేదు. ఎవరికి వారు ఎన్నికల్లో తమదే పై చెయ్యిగా ఉండాలని ఎత్తులు పై ఎత్తులు వేస్తూ .. పొలిటికల్ హీట్ పెంచేస్తున్నారు. తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీని ఎలా అయినా మట్టి కరిపించాలని చూస్తున్న విపక్షాలు ఎవరికి కుదిరిన స్థాయిలో వారు తమకు అనుకూలమైన పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నాయి. ఇక్కడ అన్ని పార్టీలది ఒకటే టార్గెట్ అదేంటి అంటే వచ్చే ఎన్నికల్లో కారు పార్టీ జోరు తగ్గించడమే. ఈ మధ్య కాలంలో తెలంగాణాలో కొత్త కొత్త పార్టీలు పుట్టుకొచ్చాయి. ఈసారి ఎవరి స్థాయిలో వారు తమ పార్టీ తరపున ఎన్నోకొన్ని సీట్లు సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఇటీవల తెలంగాణ సామాజిక ప్రజాసంఘాల ఐక్య వేదిక (టీమాస్) పేరుతో ఒక పొలిటికల్ ఫోరమ్ ఏర్పాటైంది. దీనికి ఛైర్మెన్ గా ప్రొఫెసర్ కంచె ఐలయ్య వ్యవహరిస్తున్నారు. నీ వెంటే మేమూ అంటూ భావసారూప్య సంఘాలన్నీ ఆయనతో నడవడానికి సిద్ధమయ్యాయి. తెలంగాణాలో ముందస్తు ముంచుకురావడంతో.. యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేసుకున్నారాయన. కొడితే కుంభస్థలాన్నే కొడదామన్న స్ట్రాటజీ ఆయనది. అందుకే.. సీఎం కేసీఆర్, అయన కొడుకు కేటీఆర్‌లను టార్గెట్ చేశారు.

కేసీఆర్ పోటీ చేసే గజ్వేల్ నియోజకవర్గం నుంచి ప్రజా గాయకుడు గద్దర్‌ని, మంత్రి కేటీఆర్ సెగ్మెంట్ సిరిసిల్ల నుంచి విమలక్కను బరిలో దింపాలని స్కెచ్ గీసుకున్నారు కంచె ఐలయ్య. తెలంగాణ ఉద్యమంలో బలంగా పోరాడిన వీరిద్దరికీ బీఎల్ఎఫ్, సీపీఎం మద్దతు లభించిందట. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో తాజాగా అల్లుకుంటున్న మహాకూటమి కూడా సహకరిస్తే.. సీఎంని, సీఎం వారసుడ్ని ఓడగొట్టడం కష్టమేమీ కాదని ఆయన అంచనా వేసుకున్నారు. ఈ రెండు చోట్ల పోటీ అభ్యర్థుల్ని నిలబెట్టకుండా తెలుగుదేశం, టీడీపీ, సీపీఐల్ని ఒప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారట. అయితే వీరి ప్లాన్ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

Facebook Comments