హరీష్ రావు పై కేసీఆర్ పక్కా స్కెచ్…పోరు తప్పదా..?

కొడుకు కోసం తండ్రి ఆరాటపడటంలో న్యాయముంది. కానీ అదే సమయంలో కొడుకు కంటే ప్రాధాన్యత ఉన్నవాడిని అణగదొక్కాలని చూడటం మాత్రం అన్యాయం. తెలంగాణా రాష్ట్రంలో గులాబీ గూటిలో అదే జరుగుతుంది. తన తనయుడు కేటీఆర్ కోసం హరీష్ రావుపై అప్రకటిత నిషేధం విధించి హరీష్ రావును డమ్మీని చెయ్యాలని ప్లాన్ చేశారు కేసీఆర్ .అంతే కాదు ఎమ్మెల్యే గా టికెట్ ఇవ్వకుండా ఎంపీగా పంపితే లైన్ క్లియర్ అవుతుందనే ప్లాన్ లో ఉన్నాడు.

తన తనయుడికి ముఖ్యమంత్రి పీఠాన్ని కట్టబెట్టేందుకు పార్టీ లో హరీష్ రావుకు, హరీష్ వర్గానికి ప్రాధాన్యాన్ని పూర్తిగా తగ్గించిన కేసీఆర్ హరీష్ రావు లేకుంటే పార్టీ నడవదా అన్న కోణం లో కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది.రాజకీయాల నుంచి తప్పుకోవాలనే భావన కలుగుతుందని హరీష్ రావు చెప్పిన మాటల వేదాంత ధోరణికి కేసీఆర్ తీరు ప్రధాన కారణంగా తెలుస్తుంది. హరీష్ వ్యాఖ్యలతో టీఆర్ఎస్ లో అంతర్గత రాజకీయాలపై చర్చ ముమ్మరమైంది.

టిఆర్ఎస్ అధికారిక పత్రిక నమస్తే తెలంగాణలో ఇప్పటికీ హరీష్ రావు వార్తలు రావడం లేదు. సెప్టెంబర్ 7వ తేదీన జరిగిన కేసిఆర్ హుజురాబాద్ సభ తర్వాత హరీష్ రావు వార్తలపై నమస్తే తెలంగాణ దినపత్రికలో నిషేధం అమలవుతూ వస్తోంది. తన రిటైర్మెంట్ ప్రకటనపై వివరణ ఇచ్చినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. టీఆర్ఎస్ అధికారిక టీవీ చానెల్ టీ న్యూస్ లో కూడా హరీష్ రావు వార్తలు పెద్దగా రావడం లేదు. ఎమ్మెల్యేల వార్తలకు కూడా నమస్తే తెలంగాణ దినపత్రిక, టీ న్యూస్ ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. కానీ హరీష్ రావుపై నిషేధం కొనసాగుతూనే ఉన్నట్లు చెబుతున్నారు.

హరీష్ వార్తల పై నిషేధం విధించిన కేసీఆర్ ఈ నేపథ్యంలోనే గజ్వెల్, సిద్ధిపేట, దుబ్బాక అసెంబ్లీ సెగ్మెంట్లకు అభ్యర్థులను మార్చే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. దుబ్బాక అభ్యర్థిగా రామలింగా రెడ్డి పేరును ప్రకటించగా, సిద్ధిపేట నుంచి హరీష్ రావు పోటీ చేస్తారని ప్రకటించారు. గజ్వెల్ కు కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సిద్ధిపేట నుంచి కేసిఆర్ స్వయంగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కాగా, హరీష్ రావుకు పూర్తిగా టికెట్ నిరాకరించడమో, లోకసభ సీటు ఇవ్వడమో చేస్తారని అంటున్నారు. హరీష్ రావును లోకసభకు పోటీ చేయించి, జాతీయ రాజకీయాలకు పంపించడం ద్వారా కేటిఆర్ ను ముఖ్యమంత్రి చేయాలనే తన ఆలోచనను కేసిఆర్ అమలు చేస్తారని అంటున్నారు.
హరీష్ రావు కేటీఆర్ కు పోటీకి రాకుండా చేసే ప్లాన్ లో భాగంగానే ఇదంతా కేసిఆర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ ప్రణాళికలో భాగంగానే హరీష్ రావుపై అప్రకటిత నిషేధం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో హరీష్ రావు అభిమానులు తీవ్రమైన గందరగోళానికి గురవుతున్నారు. అటు హరీష్ రావు కూడా ప్రస్తుతానికి సైలెంట్ గా వున్నారు. కానీ భవిష్యత్ లో హరీష్ రావు ఏం చెయ్యనున్నారో కేసీఆర్ ప్లాన్ కు హరీష్ ఎలా చెక్ పెట్టనున్నారో వేచి చూడాలి.

Facebook Comments