కడియంకి కేసీఆర్ షాక్… సీరియస్ వార్నింగ్ తో పాటు…

టిఆర్ఎస్ ప్రభుత్వంలో అనూహ్యంగా అదృష్టం వరించి డిప్యూటీ సీఎం పదవిని పొందిన నేత కడియం శ్రీహరి. అప్పటి వరకు ఆ పదవిలో ఉన్న రాజయ్యను తొలగించిన కెసీఆర్ ఎంపీగా ఉన్న కడియంను ఆ పదవిలో కూర్చోబెట్టారు. అప్పటి నుంచి కేసీఆర్ విధేయునిగా పని చేసుకు పోతున్న ఆయనకు ముందస్తు ఎన్నికలు కష్టాలు తెచ్చిపెట్టాయి. ఎంఎల్సీగా ఉన్నప్పటికీ ఈసారి ఎమ్యెల్యేగా పోటీ చేసి మరోసారి ప్రభుత్వంలో కీలక భూమిక పోషించాలని అనుకున్న కడియం ఆశలపై కేసీఆర్ నీళ్లు చల్లారు. ఆయన కోరుకున్న నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్యెల్యే రాజయ్యకు సీటు ఇవ్వడంతో కడియం అసంతృప్తికి గురయ్యారు. ఆ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు చర్చలు జరిపారన్న సమాచారం కూడా బయటకు పొక్కడంతో కడియం దానిని ఖండించారు. అయితే ఇదే విషయంలో కేసీఆర్ ఆగ్రహానికి కడియం గురయ్యారన్నది తాజా వార్త.

ఒకవైపు ముందస్తు ఎన్నికలకు సంబంధించి చూస్తే.. ఎన్నికల అభ్యర్థుల జాబితాను విడుదల చేయటం.. ప్రభుత్వాన్ని తాను కోరుకున్న సమయానికి రద్దు చేయటం మినహా.. మిగిలినవేమీ ఆయన ఆశించినట్లుగా సాగటం లేదన్న అసంతృప్తిలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇక.. పార్టీకి చెందిన పలువురు నేతల తీరుపై కేసీఆర్ గుస్సాగా ఉన్నట్లుగా చెబుతున్నారు. పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన కడియం శ్రీహరి తీరుపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వటమే కాదు.. అనూహ్య పరిణామాల్లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అవకాశం పొందిన కడియం.. కేసీఆర్ మనసును కష్టపెట్టేలా వ్యూహాల్ని సిద్ధం చేస్తున్నారన్న సమాచారం అందినట్లుగా చెబుతున్నారు.

స్టేషన్ ఘన్ పూర్ టికెట్ను రాజయ్యకు ఇవ్వటంపై కడియం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తన మాటకు విలువ ఇవ్వకుండా రాజయ్యకు సీటు కేటాయించిన తీరుపై కడియం గుర్రుగా ఉండటమే కాదు.. రాజయ్య ఓటమే తన లక్ష్యమన్నట్లుగా కడియం వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. ఎన్నికల ప్రచారం జోరుగా సాగాల్సిన సమయంలో.. అధికార టీఆర్ ఎస్ కు తిరుగులేని రీతిలో దూసుకెళ్లాల్సిన వేళ.. ఒకింత స్తబ్దత నెలకొందని.. పార్టీకి సంబంధించినంత వరకూ తాను.. తన కొడుకు కేటీఆర్.. తన కుమార్తె కవిత తప్పించి మరెవరూ ఆశించినంత మేర మాట్లాడటం లేదన్న భావనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. తాను రాజకీయంగా ఎంతో చక్కటి అవకాశాలు ఇచ్చినప్పటికీ.. కీలకమైన ఎన్నికల వేళ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఘాటుగా బదులు ఇవ్వని తీరుపై ఆయన గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.

పైకి కనిపిస్తున్నట్లుగా కేసీఆర్ ఏమీ కాన్ఫిడెంట్ గా లేరని.. ఎన్నికల ప్రచారం విషయంలో గులాబీ నేతల తీరు ఆయన్ను హర్ట్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. కేవలం తాను కోరుకున్న వారికి సీటు ఇవ్వలేదన్న కోపంతో కడియం వ్యవహరించిన తీరును తప్పుపడుతున్న కేసీఆర్.. ఆయన పేరు ఎత్తితేనే కస్సుమంటున్నట్లుగా సమాచారం. కడియంతో పాటు మరికొందరు నేతలు ఇదే తీరుతో వ్యవహరిస్తున్నారన్న ఆగ్రహం కేసీఆర్ లో చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్ నుంచి హామీ వస్తే కడియం తీవ్ర నిర్ణయం తీసుకునే అవకాశాలు లేకపోలేదన్నది విశ్వసనీయ సమాచారం.

Facebook Comments