ఖమ్మంలో కేసీఆర్ బేలతనం..! ఓటర్లను బెదిరించారా..?

ఖమ్మం జిల్లాలో కేసీఆర్ కు… తెలుగుదేశం పార్టీ…. టీడీపీ అధినేత చంద్రబాబు తప్ప ఎవరూ కనిపించలేదు. చంద్రబాబునాయుడు ఏదో ప్రాజెక్టులు అడ్డుకున్నారంటూ శివాలెత్తిపోయారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని… ఫిర్యాదు చేస్తూ.. కేంద్రానికి లేఖ రాశారని.. ఓ లేఖను ప్రదర్శించారు. సీతారామ ప్రాజెక్టుతో ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుందని .. ఆ సీతారామ ప్రాజెక్టు వద్దంటూ కేంద్రానికి చంద్రబాబు లేఖలు రాశారన్నారు. ప్రచారానికి వచ్చే చంద్రబాబును ఖమ్మం ప్రజలు నిలదీయాలన్నారు. ఏ ముఖం పెట్టుకుని ఖమ్మం జిల్లాలో టీడీపీ అభ్యర్థులు పోటీచేస్తున్నారని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాకు ప్రమాదం పొంచి ఉందని .. సీతారామ ప్రాజెక్టును వ్యతిరేకించేవారిని చిత్తుగా ఓడించాలన్నారు.

అందులో ఏమున్నదో కానీ.. ఆ లేఖను.. వెనక్కి తీసుకున్న తర్వాత చంద్రబాబు ఖమ్మం జిల్లాకు రావాలనన్నారు. లేకపోతే.. ఖమ్మం జిల్లా ప్రజలు చంద్రబాబును ఎక్కడిక్కడ అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఇంత కాలం పాలించిన కాంగ్రెస్, టీడీపీలు ఖమ్మం జిల్లాను ఎండబెట్టాయన్నారు. విపక్షాల మాయమాటలను ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో క్రీయాశీలకంగా మారుతామన్నారు. టీడీపీ అభ్యర్థి నామాను గెలిపిస్తే ప్రజలకు నామాలు పెడతారని హెచ్చరించారు. కేసీఆర్ గతంలో సభల్లో ప్రసంగించినట్లుగా.. చంద్రబాబుపై పరుషమైన వ్యాఖ్యలు చేయలేదు. కానీ.. కుల, మతాలు మనకు అన్నం పెట్టవని ప్రజలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కేసీఆర్ ప్రచారంలో… తాము ఖమ్మం జిల్లాను క్లీన్ స్వీప్ చేస్తామన్న శబ్దాలు వచ్చాయి..

కానీ అంత కాన్ఫిడెన్స్ మాత్రం కనిపించలేదు. చంద్రబాబునే టార్గెట్ చేసుకున్నారు. టీఆర్ఎస్ గెలవకపోతే.. ఖమ్మం జిల్లాకు ఏదో జరిగిపోతుందన్న భావన ప్రజలకు కల్పించడానికి ప్రయత్నించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేసీఆర్ బాధ చూస్తూంటే.. కాంగ్రెస్, టీడీపీ కూటమి.. క్లీన్ స్వీప్ చేయబోతోందని.. ఎలాగోలా అక్కడి ప్రజల్ని భయపెట్టి… ఆ విజయాన్ని అడ్డుకుందమని ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉంది.

Facebook Comments