కోదండరామ్ పోటీ ఇక్కడనుండేనా ?

తెలంగాణలో ముందస్తు ఎన్నికల సందడి మొదలైంది.. టికెట్ల కోసం మండిపాట్లు, గోడ దూకటాలు, అలకలు, బుజ్జగింపులు కొనసాగుతున్న వేళ ప్రధాన పార్టీలు తమ కసరత్తులో మునిగిపోయాయి.ఇటీవలే కొత్తగా ఏర్పడిన తెలంగాణ జనసమితి ఎన్నికల్లో ఏం చెయ్యబోతుంది. ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం ఎక్కడ నుంచి పోటీచేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ఈ ఎన్నికల్లో కోదండరాం పోటీ చేసేది ఖాయమే అయినా ఏ స్థానం నుంచి బరిలోకి దిగాలనే దానిపై ఇంకా స్పష్టత లేనట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ కోర్‌ కమిటీ సమావేశాల్లో సూత్రప్రాయంగా 3 నియోజక వర్గాల పేర్లను పరిశీలించినట్లు తెలుస్తుంది. మంచిర్యాల, జనగామ, వరంగల్‌ పశ్చిమ నియోజక వర్గాల్లో ఏదో ఒక దాంట్లో పోటీకి దిగాలని పార్టీ ముఖ్యనేతలు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మంచిర్యాల నియోజకవర్గం కోదండరాం సొంతూరు కావడంతో తొలి ప్రాధాన్యంగా దాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. జనగామ నియోజకవర్గంలో ఆయనకు విస్తృత సంబంధాలు ఉండడం, తెలంగణ ఉద్యమం సమయంలో పలుసార్లు జనగామ నేతలతో కలిసి పని చేయడం ఇక్కడ పోటీకి కలిసి వస్తుందని భావిస్తున్నారు. వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంలో విద్యావంతులు అధికంగా ఉండడం, ఉద్యమ భాగస్వాములతో సంబంధాలు బలంగా ఉండడం కూడా కోదండరాంకు సానుకూలమవుతుందని పార్టీవర్గాలు పేర్కొన్నాయి.

అయితే కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐలతో ఎన్నికల పొత్తులపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కోదండరాం పోటీ చేసే నియోజకవర్గాన్ని అప్పుడే ప్రకటించకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ పొత్తుల్లో భాగంగా అనివార్య పరిస్థితుల్లో ఈ మూడు నియోజకవర్గాలను ఇతర పార్టీలకుగానీ, తమ పార్టీల్లోని ఇతర నేతలకుగానీ కేటాయించాల్సి వచ్చినా.. అప్పుడు మరో నియోజకవర్గాన్ని ఎంచుకోవాలని పార్టీ అంతర్గత సమావేశాల్లో ప్రాథమిక అవగాహనకు వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఈ మూడింటిలోనూ కాంగ్రెస్‌, టీడీపీ, టీజేఎస్ తరఫున బరిలోకి దిగేందుకు స్థానికంగా ఆయా పార్టీల నేతలు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో పొత్తుల్లో ఈ సీట్లు ఏ పార్టీకి కేటాయింపులు జరిగితే అప్పుడు ఆ పార్టీ అభ్యర్థికే పూర్తిస్థాయిలో సహకరించాలనీ, అసమ్మతి వెల్లడిస్తే ప్రత్యర్థి పార్టీకి అనుకూలంగా మారే అవకాశాలుంటాయనే కోదండరాం పార్టీ ముఖ్యులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి తుది నిర్ణయం తీసుకోకపోయినా.. ఈ మూడింటిలో ఏదో ఒకస్థానాన్ని పొత్తుల్లో భాగంగా తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. పొత్తుల్లో భాగంగా కోదండుడి బాణం ఎక్కుపెట్టేది ఎక్కడో మరి త్వరలోనే తేలనుంది.

Facebook Comments