వైసీపీకి తూర్పులో ముఖ్యనేతల గుడ్ బై… టీడీపీ కి క్యూ ఎందుకో తెలుసా

తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీలో ముసలం పుట్టింది. పార్టీ మీద, జగన్ ప్రవర్తన మీద విసుగు చెంది ముఖ్య నేతలు పార్టీని వీడిపోతున్నారు. వైసీపీ అధినేత జగన్‌ పాదయాత్ర తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో ఆ పార్టీ నుంచి ఇప్పటికే అరడజనుమందికిపైగా ప్రాధాన్యం ఉన్న నాయకులు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి జనసేనలో చేరారు. తాజాగా వైసీపీ కాకినాడ పార్లమెంటరీ ఇన్‌చార్జి చలమలశెట్టి సునీల్‌ టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. సునీల్‌ బాటలో మరికొందరూ టీడీపీ వైపు దృష్టిసారించినట్టు తెలుస్తోంది.
కాకినాడ పార్లమెంట్‌ టికెట్‌ సునీల్‌కి ఖాయమైనట్టు చెప్తున్నారు. అలా దృష్టిసారిస్తున్న నేతలకు టీడీపీ నుంచీ ఆహ్వానం అందుతున్నట్టు తెలుస్తోంది. ముందు నుంచీ వైసీపీలో అత్యంత కీలకమైన నేతలుగా గుర్తింపు ఉన్న నాయకులు కూడా ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. టికెట్ ఎవరికిస్తారో తెలీని స్థితిలో గోడ దూకుతున్నారు. అంతే కాక జగన్ ప్రజా సంకల్ప యాత్ర సాగుతున్న జిల్లాలలో అక్కడ యాత్ర సక్సెస్ చెయ్యటానికి అంగ బలం, అర్ధబలంతో నానా తిప్పలు పడినా అధినేత నుండి అంత ప్రాధాన్యం దక్కకపోవటం కూడా ఒక కారణంగా తెలుస్తుంది.

దీంతో వైసీపీలో ఇమడలేమని, ఆ పార్టీకి భవిష్యత్‌ ఉండదని భావిస్తున్న ముఖ్య నేతలు ఇప్పటికీ చాలా మంది పార్టీ కి గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం కోనసీమకు చెందిన మాజీ మంత్రి ఒకరు వైసీపీ నుంచి టీడీపీలో చేరడానికి కుతూహలంగా ఉన్నారని తెలుస్తోంది. రాజోలుకు చెందిన మాజీ ఎమ్మెల్యే కూడా టీడీపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారు. బలమైన నేతగా గుర్తింపు ఉన్న సదరు నేత చేరికపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కోనసీమలో బీసీలలో బలమైన నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యేపైనా టీడీపీ దృష్టిసారించింది. సదరు నేతను పార్టీలోకి ఆహ్వానిస్తే కోనసీమలో బీసీలలో మెజార్టీని తమవైపు తిప్పుకోవచ్చని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అలాగే మండపేటలోనూ టికెట్‌ దక్కకపోతే టీడీపీలో చేరేందుకు ఆ పార్టీ ముఖ్యనేత రెడీ అవుతున్నారు.

ఇలా పలు నియోజకవర్గాలలో వైసీపీలో ఇమడలేని నేతలు టీడీపీ వైపు దృష్టిసారించారు. కాకినాడకు చెందిన మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ, ఆయన తనయుడు శశిధర్‌, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పదవి నిర్వహించిన సంగిశెట్టి అశోక్‌ ముమ్మిడివరానికి చెందిన పితాని బాలకృష్ణ, రాజమహేంద్రవరం నుంచి కందుల దుర్గేష్‌ తదితరులు వైసీపీ నుంచి జనసేనలో చేరారు. ఇపుడు వైసీపీ నుంచి టీడీపీలో చేరేందుకు పలువురు నేతలు తహతహలాడుతున్నారు. టికెట్ ఇవ్వటంలో సందిగ్ధ వాతావరణం, జగన్ వ్యవహారశైలి నచ్చని నేతలు కొందరు టీడీపీ కి క్యూ కడుతున్నారు.

Facebook Comments