మహా కూటమికి కోదండరాం ఒకే .. కానీ కండిషన్స్ అప్లై

తెలంగాణాలో అసెంబ్లీ రద్దుచేసిన కేసీఆర్ అన్ని పార్టీల్లో ఎన్నికల వేడి పెంచేసాడు. ఎలా అయినా ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడించాలని గులాబీ బాస్ చూస్తుండగా … ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్ఎస్ అధికార పీఠం ఎక్కకుండా చేయాలనీ మిగతా పార్టీలన్నీ చూస్తున్నాయి. అందుకే… టీఆర్ఎస్ వ్యతికరేక పార్టీలన్నీ కలిసి మహా కూటమిగా కూడా ఏర్పడ్డాయి. ఇందులో టీడీపీ, కాంగ్రెస్, సీపీఎం తదితర పార్టీలు ఉండగా ప్రొఫెసర్ కోదండరాం కు చెందిన తెలంగాణ జనసమితి పార్టీలో చేరాలా వద్ద అనే తర్జన భర్జన పడుతోంది.

అయితే మహాకూటమిలో చేరాల్సిందిగా కోదండరాం ని మిగతా పార్టీలు వత్తిడి చేస్తుండడంతో.. కొన్ని షరతులు విధించి మరి కాంగ్రెస్ ప్రతిపాదిత మహాకూటమిలో చేరేందుకు తెలంగాణ జన సమితి ఓకే చెప్పింది. మహాకూటమి కోసం రూపొందించే కనీస ఉమ్మడి కార్యక్రమం ఛైర్మన్ గా కోదండ రాంను నియమించాలని కోరుతోంది. అంటే కూటమి జుట్టును తమ చేతిలో పెట్టుకోవాలని టీజేఎస్ భావిస్తోంది. కాంగ్రెస్ ఇచ్చే సీట్ల విషయంలో పట్టువిడుపులతో ఉండాలని. కానీ, కామన్ మినిమమ్ ప్రోగ్రాం ఛైర్మన్ పదవిని మాత్రం కచ్చితంగా కోరాలని టీజేఎస్ భావిస్తోంది. ఈ పదవిని కోరడమంటేనే దాదాపు ముఖ్యమంత్రి పదవి కోరినట్టేనన్న భావన కూటమిలో ఉంది.

మహాకూటమి గెలిచి అధికారంలోకి వస్తే కామన్ మినిమమ్ ప్రోగ్రాం ఛైర్మన్ పదవి చాలా కీలకంగా మారుతుంది. దాదాపు ముఖ్యమంత్రితో సమాన స్థాయి పదవిగా చలామణిలో ఉండే అవకాశం ఉంటుంది. మహాకూటమి మ్యానిఫెస్టో మొత్తానికి ఆయనే ఛైర్మన్ గా ఉంటారు. మ్యానిఫెస్టో అమలు బాధ్యత ముఖ్యమంత్రిదే కనుక. ఈ కమిటీ ఛైర్మన్ అంటే దాదాపు సీఎం పదవితో సమాన హోదాను కోరుకుంటున్నట్టే భావించాల్సి ఉంటుంది. కోదండ రాం ప్రతిపాదిస్తోన్న ఈ పదవి ఇవ్వడానికి కాంగ్రెస్ అంగీకరిస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ అంగీకరిస్తే. కూటమిలో కోదండ రాం పాత్ర చాలా కీలకంగా మారుతుంది. కోదండ రాంకు పబ్లిక్ లో ఇమేజ్ ఉంది కనుక. ఆ మేరకు కూటమికి విశ్వసనీయత వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ ప్రతిపాదన వాళ్ళ ఎక్కువ లాభపడేది కోదండరాం అయితే.. ఎక్కువ నష్టపోయేది కాంగ్రెస్ పార్టీనే.

Facebook Comments