ఖమ్మం, పాలేరులో కూటమి జోరుకు బ్రేకుల్లేవ్‌..!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మహాకూటమి కుమ్మేస్తుంది. మహాకూటమిలో టీడీపీ, కాంగ్రెస్‌, సీపీఐ శ్రేణులు కలిసికట్టుగా కసితో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీని ఓడించేందుకు కంకణం కట్టుకున్నాయి. మూడు పార్టీలు సమన్వయంతో పని చేస్తు కూటమి తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించుకొనేందుకు తీర్మానించాయి. దీంతో జిల్లాల్లోని పలు కీలక నియోజకవర్గాల్లో మహాకూటమి అభ్యర్థుల దూకుడు ముందు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు బెంబేలెత్తుతున్నారు. ఈ ఎన్నికల కోసం గత ఆరు నెలలుగా తాము నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నా స్థానికుల నుంచి వారికి తీవ్రమైన వ్యతిరేఖత వ్యక్తం అవుతూ వస్తోంది. అయితే నిన్నటి వరకు కూటమి తరపున ఎవరు పోటీ చేస్తారో క్లారిటీ లేదు. ఇప్పుడు కూటమి మధ్య‌ బలమైన అనుబంధం ఏర్పడడంతో పాటు సరైన అభ్యర్థులను పెట్టడంతో పాటు టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు కూటమి వ్యూహంలో విలవిల్లాడుతున్నారు.

మహాకూటమి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తుంటే ఇప్పుడు అందరి దృష్టి ఖమ్మం నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు, పాలేరు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో ఉన్న కందాళ ఉపేందర్‌ రెడ్డి వైపే ఉంది. వీరిద్దరు ఆయా నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్న పువ్వాడ అజయ్‌ కుమార్‌, తాజా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఖమ్మంలో కాంగ్రెస్‌ సీటు రేసులో ఉన్న మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మ‌న్ మానుకొండ రాధాకిషోర్‌తో పాటు, టీఆర్‌ఎస్‌ పార్టీ నియంతృత్వ విధానాలు నచ్చక కాంగ్రెస్‌లోకి జంప్‌ చేసిన మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు సైతం నామా అభ్యర్థిత్వాన్ని బలపరచడంతో ఖమ్మంలో నామా జోరుకు ఎలా బ్రేకులు వెయ్యాలో తెలియక అజయ్‌ చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చింది. నెల రోజుల ముందు వరకు గెలుపు నాదే అన్న కాన్ఫిడెన్స్‌తో ఉన్న అజయ్‌కు ఎప్పుడైతే మహాకూటమి ఏర్పడిందో అప్పుడే సగం కాన్ఫిడెన్స్‌ మాయం అయ్యింది. ఇక నామా అభ్యర్థిత్వం ఖ‌రారు అవ్వడం ఒక ఎత్తు అయితే… మహాకూటమి పార్టీలు, ఖమ్మం నియోజకవర్గంలో పట్టున్న నాయకులందరూ ఆయనకు సపోర్ట్‌ చెయ్యడంతో ఇప్పుడు అజయ్‌ పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయారు. నామా ఇటు ఖమ్మంలో తన ప్రచారానికి ప్రణాళికలు రచించుకోవడంతో పాటు అటు జిల్లాల్లో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులు, కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపు వ్యూహంలో కూడా కీలకం అవుతున్నారు. అశ్వారావుపేట టీడీపీ అభ్యర్థి మచ్చ నగేశ్వరరావు నామినేషన్‌ కార్యక్రమానికి హాజరు అయిన నామా… ఇటు పాలేరు అభ్యర్థి కందాళ ఉపేందర్‌ రెడ్డి నామినేషన్‌లో పాల్గొని మాంచి జోష్‌ తెచ్చారు.

ఖమ్మం నియోజకవర్గంలో బలంగా ఉన్న కాంగ్రెస్‌ వర్గం మొత్తం నామాకు ఫుల్‌గా సపోర్ట్‌ చేస్తుంది. ఎలాగైనా ఇక్కడ నాలుగేళ్ల పాటు నియోజకవర్గంలో సాగిన అక్రమాలు, దందాలు, అరాచకాలు, అవినీతికి చెక్‌ పెట్టాలంటే నామాను గెలిపించుకోవాలని వాళ్లంతా బలంగా తీర్మానించుకున్నారు. ఈ క్రమంలోనే నిన్నటి వరకు ఈ సీటు కాంగ్రెస్‌కు రాలేదని అలకపూనిన నాయకులు సైతం ఇప్పుడు ఏకతాటి మీదకు వచ్చి నామాకు సపోర్ట్‌ చేస్తున్నారు. ఈ పరిణామాలన్ని ఖమ్మంలో నామా గెలుపులో తిరుగులేని అస్త్రాలుగా మారనున్నాయి. ఇక పాలేరులో సైతం బలంగా ఉన్న టీడీపీకి తోడు అటు నామా వర్గం కూడా ఉపేందర్‌ రడ్డి గెలుపు కోసం పని చేస్తుంది. టీడీపీకి వెన్నుదండుగా ఉండే ఓ ప్రధాన సామాజికవర్గం ఓటర్లతో పాటు నియోజకవర్గంలో నామా కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు, ఆయన అనుచర గణం మొత్తం ఉపేందర్‌ రెడ్డిని ఎలాగైనా గెలిపించాలని కంకణం కట్టుకుంది.

అదే టైమ్‌లో ఉపేందర్‌ రెడ్డి నామినేషన్‌ కార్యక్రమానికి సైతం హాజరు అయిన నామా అక్కడ ఆయన్ను గెలిపించాలని తన వర్గానికి అదేశాలు జారీ చేశారు. ఇప్పటికే స్థానికత నినాదంలో దూసుకుపోతున్న ఉపేందర్‌ రెడ్డికి ఇటు నామా సైతం బలంగా తన మద్దతు ప్రకటించడంతో ఉపేందర్‌ రెడ్డి సిట్టింగ్‌ అధికార పార్టీ నుంచి పోటీ చేస్తున్న తాజా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. మహాకూటమిలో పార్టీల ఈక్వేషన్లు, సామాజిక, ఆర్థిక సమీకరణలు సైతం ఉపేందర్‌ రెడ్డికి కలిసి రానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగానే ఖమ్మం జిల్లా నుంచి ఆసక్తి రేపుతున్న ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో కూటమి తరపున పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు, కందాళ ఉపేందర్‌ రెడ్డి దూకుడు, వ్యూహాల‌తో అధికార పార్టీ అభ్యర్థులకు ముచ్చెమటలు పడుతున్నాయి. నిన్నటి వరకు గెలుపు తమదే అని లెక్కలు వేసుకున్న ఈ రెండు నియోజకవర్గాల టీఆర్‌ఎస్‌ ఇప్పుడు అభ్యర్థులు కూటమి అభ్యర్థులను ఎలా ఎదుర్కోవాలని డిఫెన్స్‌లో పడినట్టే ఖమ్మం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Facebook Comments