మమత ఆహ్వానం వెనుక అసలు కథ ఇదేనా..? కేసీఆర్ ను అందుకే దూరం పెట్టిందా..?

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ పై తీవ్రమైన కోపంతో ఉన్నారు. బీజేపీకి వ్యతిరేఖంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న మమత బీజేపీ వ్యతిరేఖులకు కోల్ కత్తాలో తానూ తలపెట్టిన ర్యాలీకి ఆహ్వానం పంపారు. బయటకు ఎంత బీజేపీ ని కేసీఆర్ తిడుతున్నా, బీజేపీ నాయకులు కేసీఆర్ ను తిడుతున్నా లోపల లోపాయికారీ ఒప్పందాలు ఉన్నాయని భావించిన మమతా దీదీ కేసీఆర్ తో దోస్తీ కటీఫ్ చేసుకున్నారు. బిజెపికి వ్యతిరేకంగా తలపెట్టిన తృతీయ ప్రత్యామ్నాయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే ప్రాధాన్యం ఇవ్వాలని దీదీ నిర్ణయించుకున్నారు. కేసిఆర్ ను దగ్గరకు కూడరానివ్వొదని దీదీ భావిస్తున్నారు.

బిజెపికి వ్యతిరేకంగా కోల్ కతాలో తలపెట్టిన ర్యాలీకి ఆమె ఇప్పటికే చంద్రబాబుకు ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. కేసిఆర్ కు ఆహ్వానం పంపించలేదని సమాచారం. జనవరి 19వ తేదీన తలపెట్టిన ఆ ర్యాలీకి బిజెపికి వ్యతిరేకంగా ఉన్న పార్టీల నేతలను ఆహ్వానిస్తూ మూడు రోజుల క్రితం లేఖలు రాశారు. చంద్రబాబుకు ఆ అహ్వానం అందినట్లు తెలుస్తోంది. ర్యాలీకి హాజరు కావాలని కూడా ఆయన నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే మంత్రి వర్గ సమావేశంలో ఆ దిశగా బీజేపీ వ్యతిరేక పోరాటంలో వివిధ రాష్ట్రాలకు బాసటగా నిలిచి అవసరం అయితే ప్రచారం చెయ్యాలని నిర్ణయించుకున్న చంద్రబాబు మమత ఆహ్వానాన్ని అంగీకరించి కోల్ కత్తాకు వెళ్లనున్నారు.బిజెపి, కాంగ్రెసు పార్టీలకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలని గతంలో కేసిఆర్ తలపెట్టారు. ఆ సమయంలో ఆయన మమతా బెనర్జీని కలిసి తనతో కలిసి రావాలని కోరారు. అయితే, పరిస్థితులు మారిన నేపథ్యంలో కేసిఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి దగ్గరయ్యారు. కాంగ్రెసును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టీఆర్ఎస్, బిజెపిల మధ్య రహస్య అవగాహన కుదిరిందనే అభిప్రాయమే బలంగా ప్రచారంలో ఉంది.

ఎన్డీఎ నుంచి వైదొలిగి బిజెపికి దూరమైన తర్వాత చంద్రబాబు బిజెపిపై, కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ప్రత్యక్ష పోరాటానికి దిగారు. తనతో కలిసి కేంద్రంపై పోరాటం చేసే ఎవరినైనా కలుపుకుని ప్రయాణం సాగించాలని భావిస్తున్న బాబును మమతా బెనర్జీ తనతో తీసుకుని వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
వచ్చే లోకసభ ఎన్నికలకు ముందు బిజెపి వ్యతిరేక శక్తిని ప్రదర్శించాలనే ఉద్దేశంతో జనవరి 19వ తేదీన కోల్ కతాలో ర్యాలీని తలపెట్టారు. ఈ ర్యాలీకి జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలను ఆహ్వానించారు. మరి బీజేపీ వ్యతిరేక పోరాటం కోల్ కత్తా నుండి ప్రారంభం కాబోతుంది.

Facebook Comments