టి. కాంగ్రెస్ లో మెస్సేజ్ .. ఫోన్ కాల్ టెన్షన్ !

ఎన్నికల మూడ్ లో ఉన్న తెలంగాణ రాజకీయ పార్టీలకు ఇప్పుడు ఏ విషయం అయినా పెద్ద టెన్షన్ గానే ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల్లో పోటీకి నిలబడదాము అని చూస్తున్న ప్రతి అభ్యర్ధికి కూడా ఇది ఎంతో కీలక సమయం కాబట్టి. ఇప్పటివరకు ఆ హడావుడి టీఆర్ఎస్ పార్టీలో బాగా కనిపించింది. అయితే… ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆ సీన్ కనిపిస్తోంది. ఎందుకంటే.. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనపై కాంగ్రెస్‌ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సహా పలువురు సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ పరిణామం పార్టీ టికెట్లు ఆశించే అభ్యర్థుల్లో టెన్షన్ కలిగిస్తోంది.

ముందస్తు ఎన్నికలు, తాజా రాజకీయ పరిస్థితులపై అధిష్టానంతో చర్చలు జరిపినట్లు సమాచారం. రాహుల్‌తో భేటీ అనంతరం పలువురు తెలంగాణ నేతలకు ఉత్తమ్‌ నుంచి మెసేజ్‌లు వచ్చాయి. ‘ప్రియమైన స్నేహితుల్లారా.. ఢిల్లీ నుంచి మీకు ఒక ముఖ్యమైన ఫోన్‌ కాల్‌ రానుంది. రిసీవ్‌ చేసుకుని స్పందించడానికి సిద్ధంగా ఉండాలని కోరుతున్నానంటూ’ ఉత్తమ్‌ సందేశాలు పంపించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటనపై స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్‌ నేతల్లో టెన్షన్‌ పెరిగిపోయింది. మెసేజ్‌ అందుకున్నవారేమో ఎందుకు వచ్చిందన్న అనుమానంతో.. మెసేజ్‌ రాని వారు తమకు ఎందుకు రాలేదా అన్న సందేహంతో ఆందోళన చెందుతున్నారు.

ఈ నేపథ్యంలోనే .. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికకు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా భక్త చరణ్‌దాస్‌ను రాహుల్ గాంధీ నియమించారు. స్క్రీనింగ్ కమిటీ సభ్యులుగా ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ, జ్యోతిమనిసెంథిమలై నియమితులయ్యారు. వీరంతా కలిసి పార్టీ తరపున ఏ ఏ అభ్యర్థిని ఏమికా చేయాలి..? ఎవరి బలం ఎంత అనే విషయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇది ఇలా ఉంటే కాంగ్రెస్ లో పెరిగిన రాజకీయ ఊపు పక్క పార్టీల నేతలను.. తటస్థులను కాంగ్రెస్ వైపు చూసేలా చేస్తోంది.

Facebook Comments