నగరి బరిలో ఆ మూడో వ్యక్తి ఆయనే…

పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చిన చందంగా టికెట్ నాకంటే నాకంటూ గొడవలు పడుతూ ఇద్దరికీ కాకుండా మూడో వ్యక్తి చేతిలో పెట్టేలా వున్నారు ఆ టీడీపీ నాయకులు. ఒకవైపు స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే తీరు స్థానికంగా టీడీపీకి అవకాశం ఇచ్చేలా ఉంటే క్షేత్ర స్థాయిలో పని చెయ్యటం మానేసి ఇద్దరు అన్నాతమ్ముళ్ళు టికెట్ కోసం కొట్లాడుకుంటున్న విషయం తెలిసిన బాబు మూడో పేరు తెర మీదకు తీసుకురావటంతో మొదటికే మోసం వచ్చేలా వుందని ఎవరికిచ్చినా పరవాలేదు అని చెప్పారట. ఇంతకీ ఈ గొడవంతా ఎక్కడంటే వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలో..
చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి పెట్టిన నియోజకవర్గాల్లో నగిరి ఒకటి.

ఆ చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలం పుంజుకోవడానికి కీలకమైన నియోజకవర్గాల్లో ఒకటైన నగిరి అలాగే సరిహద్దు చంద్రగిరి నియోజకవర్గంపై కూడా చంద్రబాబు గెలవాలనే ఆలోచనలో ఉన్నారు. నగిరి విషయంలోపట్టుదలగా ఉన్న చంద్రబాబుకి అక్కడి వర్గ రాజకీయాలు ఇబ్బందిగా మారాయి. టీడీపీ సీనియర్‌ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు మృతి చెందిన తర్వాత నగరి అసెంబ్లీ టిక్కెట్‌ కోసం ముద్దుకృష్ణమ తనయులు భానుప్రకాష్‌, జగదీష్‌ పోటీపడుతున్నారు.కుమారులిద్దరి మధ్య సమన్వయం లేకపోవడంతో ముద్దుకృష్ణమ సతీమణి సరస్వతమ్మకు అవకాశమిచ్చారు. సరస్వతమ్మ చిన్న కొడుకు జగదీష్‌ వైపు మొగ్గు చూపుతుండగా పెద్ద కుమారుడు భానుప్రకాష్‌ టిక్కెట్‌ తనకే వస్తుందనే ఆశతో గత కొంత కాలంగా నియోజకవర్గంలో విస్తృతంగా తిరగడమే కాకుండా గ్రామదర్శిని, ఇంటింటికి తెలుగుదేశం వంటి కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించారు. క్యాడర్ మొత్తం ఆయనకే మద్దతుగా ఉంది.. ఇక చిన్నకొడుకు జగదీశ్ విషయంలో చంద్రబాబుకి మంచి అభిప్రాయం లేదు. కానీ జగదీశ్ మాత్రం సీటు తనకే కావాలని చెప్పటంతో వారినే ఒక అంగీకారానికి రావాలని సూచించైనా చంద్రబాబు లేనిచో మూడో వ్యక్తికి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు.

ఆయన ఎవరో కాదు సిద్ధార్థ ఇంజనీరింగు కళాశాలల అధినేత అశోక్‌రాజు. ఆయన పుంగునూరు సీటు ఆశించడం, ఆ సీటు అమరనాద్ రెడ్డి కోరటంతో నగిరి సీటుని వాళ్ళ ఇద్దరికీ కాకుండా అశోక్ రాజుకి ఇవ్వచ్చనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపధ్యంలో అసలుకే ఎసరు పడేలా ఉందని భావించి ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న రాయబారంతో సీటు తమలో ఎవరికి ఇచ్చినా ఇబ్బంది లేదని చంద్రబాబుకు స్పష్టం చేశారు ముద్దు కృష్ణమ తనయులు. తమకు కాకుండా వేరేవాళ్ళకు ఇచ్చినా పార్టీ కోసం కలిసి పని చేస్తామని చెప్పారు. మరిప్పుడు తాజాగా వినిపిస్తున్న అశోక్ రాజు కు అవకాశం లభిస్తుందో లేదో… బాల్ బాబు కోర్టులో ఉంది.

Facebook Comments