ఏపీ క్యాబినెట్ విస్తరణలో కొత్త పేరు .. ఎవరో మరి ఆ అమాత్యులు

ఏపీ క్యాబినెట్ విస్తరణ అంశం ఇప్పుడు అశావహుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తుంది. నాకంటే నాకు అంటూ ఆశావహులు తమకే ఎందుకివ్వాలో చెప్తున్నారు. అధినేత చంద్రబాబును ప్రసన్నం చేసుకోటానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో రోజు రోజుకీ ఆశావహుల లిస్ట్ పెరిగిపోతూ ఉంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడ్ మంత్రి వర్గ విస్తరణ చెయ్యాలని ప్లాన్ చేస్తున్న నేపధ్యం లో ఆశావహుల్లో కొత్త ఆశ‌లు రేగుతున్నాయి.ఎవరికి వాళ్ళు మేమే అర్హులమని చెప్పుకుంటూ మంత్రి పదవి ఆశిస్తున్నారు. దాంతో ఇప్పుడు మంత్రివ‌ర్గంలో చోటు కోసం చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. ఏపీ క్యాబినెట్ నుంచి పైడికొండ‌ల మాణిక్యాలరావు బీజేపీ మంత్రి రాజీనామా చేయ‌డంతో కాపు సామాజిక వర్గ కోటాలో ఒక‌టి ఖాళీ అయ్యింది. క‌మ్మ సామాజిక వర్గ కోటాలో కామినేని శ్రీనివాస్ సీటు ఖాళీగా ఉంది. తూర్పు గోదావ‌రి జిల్లా నుంచి ఆశావాహుల జాబితాలో కాపు కులానికి చెందిన జ్యోతుల నెహ్రూ క‌నిపిస్తున్నారు. అయ‌న‌కు పోటీగా తోట త్రిమూర్తులు కూడా ఉన్నారు. వీరిద్ద‌రిలో ఒక‌రికి మంత్రి ప‌ద‌వి ఇస్తార‌నే ప్ర‌చారం ఉంది.అయితే ఆరెండు ఖాళీల‌ను మైనార్టీ, ఎస్టీ కోటాల‌తో నింపాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

చంద్రబాబు త‌మ‌కు గ‌తంలో ఇచ్చిన హామీలు అమ‌లు చేయాలంటూ ప‌లువురు ముందుకొస్తున్నారు.అయితే ఎవ‌రికి చంద్ర‌బాబు న్యాయం చేస్తార‌న్న‌ది తెలియాల్సి వుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంత్రి వర్గ విస్తరణ చేయనున్న బాబు పార్టీలో , ప్రజల్లో పట్టు వున్నా నాయకులపై దృష్టి సారించారు. కాపు కోటాలో మంత్రి ప‌ద‌వి కేటాయించాల్సి వ‌స్తే ఖ‌చ్చితంగా గోదావ‌రి జిల్లాల్లో ఈసారి తూర్పు గోదావ‌రి కాపుల‌కు అవ‌కాశం ఖాయం అని చెప్ప‌వ‌చ్చు. ఆ అవకాశం త‌మ‌కంటే త‌మ‌కంటూ తోట , జ్యోతుల పోటీ ప‌డుతుండ‌డం విశేషం. వారిద్దరూ గ‌తంలో పార్టీ ఫిరాయించి మ‌ళ్లీ టీడీపీలోకి వచ్చిన వారే.అంతేగాకుండా జ్యోతుల నెహ్రూ వైసీపీ తరుపున గెలిచిన ఫిరాయింపు ఎమ్మెల్యే. పార్టీ మారిన స‌మ‌యంలో ఆయ‌న‌కు హామీ ఇచ్చిన‌ట్టుగా నెహ్రూ త‌న‌యుడు జ్యోతుల న‌వీన్ కి తూర్పు జెడ్పీ పీఠం క‌ట్ట‌బెట్టారు. దాంతో ఆయ‌నకు మంత్రి ప‌ద‌వి ఎలా కేటాయిస్తారంటూ తోట త్రిమూర్తులు ప్ర‌శ్నిస్తున్నారు. దాంతో ఈ ఇద్ద‌రినీ కాద‌ని మ‌రొక‌రికి కేటాయించే అవ‌కాశం కూడా లేక‌పోలేద‌ని అంటున్నారు. ఇంతకీ ఆ కొత్త పేరు ఎవరిదో అనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.

Facebook Comments