పారీకర్ గుప్పిట్లో రాఫెల్ రహస్యాలు..! పదవి నుంచి దింపేస్తే బయటపెడతానని బెదిరిస్తున్నారా..?

గోవా ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులు అనారోగ్యానికి గురయ్యారు. ఇటీవల ఆస్పత్రుల పాలయ్యారు. దాంతో, సీఎం మనోహర్‌ పారీకర్‌ సోమవారం వారిని మంత్రి పదవుల నుంచి తొలగించారు. ఇద్దర్ని కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కానీ సీఎం పారీకరే ఆస్పత్రిలో ఉంటున్నారు. నెలల తరబడి… ఆయన పాలనను పట్టించుకునే పరిస్థితి లేదు. కేన్సర్‌ చికిత్సకు కొన్ని నెలలపాటు అమెరికా కూడా వెళ్లారు. కొద్ది రోజులుగా ఢిల్లీలోని ఎయిమ్స్‌లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు. అయినా.. సీఎంగా ఆయనే కొనసాగుతున్నారు. పారీకర్ ను మార్చేది లేదని అమిత్ షా.. వణికిపోతూ చెబుతున్నారు. అనారోగ్యానికి గురైన మంత్రులను తొలగించి… పారీకర్ ను ఎందుకు వదిలేశారన్న ప్రశ్న జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.

మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గోవా సీఎంగా ఉన్న పారీకర్ ను ఢిల్లీకి తీసుకొచ్చి రక్షణ మంత్రి బాధ్యతలు అప్పగించారు. ఒకప్పుడు డీఆర్‌డీఏకు కాంట్రాక్టర్‌గా వ్యవహరించిన పారీకర్ .. ఐఐటీలో ఇంజనీరింగ్‌ చేశారు. సాంకేతిక అంశాలపై గట్టి పట్టు ఉంది. తన వద్దకు వచ్చిన ప్రతి ఫైల్‌ను క్షుణ్ణంగా చదివి వాటిపై నోట్స్‌ రాసేవారు. దీంతో, రక్షణ శాఖలో ఫైల్స్‌ చాలా నెమ్మదిగా కదిలేవి. ఎంత పెద్ద ఫైల్‌ అయినా మొదటి నుంచి చివరి వరకూ చదివి.. ఆ తర్వాతే దాన్ని పంపేవారు. ఫలితంగా, కొన్ని కీలక రక్షణ ప్రాజెక్టుల విషయంలో జాప్యం జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ కారణంగానే.. మోదీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాఫెల్‌ ఫైల్స్‌ కూడా నెమ్మదిగా కదిలాయి. అది ప్రభుత్వంలోని పెద్దలకు నచ్చలేదు.

అయితే పారీకర్ రక్షణమంత్రిగా ఉన్నప్పుడే రాఫెల్‌ డీల్‌లో నిబంధనలను కేంద్ర సర్కారు ఉల్లంఘించింది. భద్రతా వ్యవహారాలపై కేబినెట్‌ కమిటీలో చర్చించకుండానే పాత ఒప్పందాన్ని రద్దు చేస్తూ, 36 విమానాల కొనుగోలుకు సర్కారు నిర్ణయం తీసుకుంది. రాఫెల్‌ కొత్త డీల్‌పై పారిస్‌లో ప్రధాని మోదీ ప్రకటన చేసినప్పుడు కూడా పారీకర్‌ అక్కడే ఉన్నారు. కానీ, ఆ విషయం అప్పటి వరకూ పారీకర్ కు తెలియదు. దాంతో.. ఆయన వైదొలిగేందుకు నిర్ణయించుకున్నారు. దానికి గోవా ఎన్నికలు కలిసొచ్చాయి. కానీ రాఫెల్ గుట్టు అంతా.. పారీకర్ కు తెలుసు. పదవి నుంచి తీసేస్తే.. వాటిని ఎక్కడ బయటపెడతారోననేది… బీజేపీ అగ్రనేతల భయమన్న అంచనాలు బాగానే వినిపిస్తున్నాయి.

Facebook Comments