తెలంగాణలో సందడే సందడి ! పొత్తులు ఎత్తులతో పార్టీలు బిజీ బిజీ

ఎన్నికల సమయంలో పార్టీలన్నీ పొత్తుల ఎత్తులతో బిజీబిజీగా ఉంటాయి. ఏ పార్టీతో ఏ పార్టీ జతకడితే బాగుంటుంది. ఎవరితో కలిసి ఎన్నికల బరిలోకి వెళ్తే తమకు ఎక్కువ లాభం వస్తుంది అనే అనేక అంశాలతో పార్టీలన్నీ తీరిక లేకుండా లెక్కలు వేసుకునేపనిలో బిజీ బిజీగా కనిపిస్తుంటాయి. ఇక ముందస్తు ఎన్నికలకు వెళ్లే నేపథ్యంలో తెలంగాణాలో అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్ అన్ని పార్టీలో వేడి పెంచాడు. టీఆర్ఎస్ పార్టీ అంతో ఇంతో బలంగా ఉండడంతో కేసీఆర్ గెలుపుధీమా వ్యక్తం చేస్తున్నాడు. అయితే విపక్ష పార్టీలు అంతగా బలం లేకపోవడంతో బలమైన పార్టీలతో పొత్తు పెట్టుకుని అధికార జెండా ఎగురవేసేందుకు సిద్ధం అవుతున్నాయి.

టీఆర్ఎస్ దూకుడికి కళ్లెం వేసేందుకు ముందుగా టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు రంగంలోకి దిగాడు. తెలంగాణ టిడిపికి స్వేచ్ఛ కల్పించడంతో టి టిడిపి కమిటీ యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టేసింది. అందులో భాగంగా మూడు కమిటీలు ఇప్పటికే ప్రకటించింది. సమన్వయ కమిటీ, ఎన్నికల నిర్వహణ కమిటీ, ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీ ఏర్పాటు అయిపోయాయి. టి.టిడిపి పొత్తుల్లో భాగంగా తొలిదఫాలో సిపిఐ తో భేటీ అయ్యింది. సిపిఐ నేత చాడా వెంకట రెడ్డితో పొత్తు చర్చలు మొదటి దశ పూర్తి అయ్యింది. కెసిఆర్ ను వచ్చే ఎన్నికల్లో అంతా కలిసి ఢీ కొట్టి ఓడించాలన్నదే ప్రధాన ఎజెండాగా రెండు పార్టీలు సమాలోచనలు సాగించాయి.

అలాగే… టి జేఏసీ నేత కోదండరాం బృందం తో కూడా టి.టిడిపి చర్చించనుంది. ఇక కాంగ్రెస్ పార్టీతో చిట్ట చివరిగా చర్చించి మాహాకూటమిగా ఏర్పడాలన్న ఆలోచనతో విపక్ష పార్టీలు ముందుకు వెళ్తున్నాయి. ఇక జనసేన సైతం తెలంగాణ లో తమ ఉనికి చాటుకునే ప్రయత్నాల్లో బిజీ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీపీఎం నేతలతో చర్చలు మొదలు పెట్టేశారు. ఈనెల 11వ తేదీన మరోసారి చర్చలు జరపాలని నిర్ణయించారు. టి ఎన్నికల్లో పొత్తుల గొడవ పూర్తి అయితే పవన్ ఎన్నిసీట్ల లో తమ పార్టీ పోటీ చేయాలి..? మిత్రపక్షానికి ఎన్ని సీట్లు కేటాయించాలి అన్న అంశాలపై మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. ఇక విపక్షాల సందడి ఇలా ఉంటే టీఆర్ఎస్ లో మాత్రం టికెట్ల లొల్లి.. గ్రూపు తగాదాలుతో సతమతం అవుతూనే ఎన్నికలకు సిద్ధం అవుతోంది.

Facebook Comments