షాకింగ్: బీజేపీలోకి రాజనర్సింహ సతీమణి.. చేరడం వెనుక అసలు కథ ఇదేనా..?

కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్, ఆ పార్టీ కీలక నేత దామోదర రాజనర్సింహ సతీమణి పద్మినీరెడ్డి బీజేపీలో చేరడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామానికి దారి తీసింది. దామోదర రాజనర్సింహ తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక నేతగా, మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉన్న తరుణంలో ఆమె సతీమణి బీజేపీలో ఎందుకు చేరిందోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అయితే కొద్దిరోజులుగా పద్మినీరెడ్డి బీజేపీలో చేరేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

పద్మినీరెడ్డి చేరికకు శ్రీపీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణానంద కీలక పాత్ర పోషించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో భేటీ అయిన పరిపూర్ణానంద పలు రాజకీయ పరమైన చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. తెలంగాణలో తనకు శిష్యులుగా ఉన్న కొంతమంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ఓ జాబితాను సిద్ధం చేసి దాన్ని అమిత్‌షాకు అందజేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పద్మినీరెడ్డి బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అమిత్‌‌షాకు పరిపూర్ణానంద తెలియజేసినట్లు సమాచారం. ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు అమిత్ షా సానుకూలంగా స్పందించడంతోనే ఇవాళ పద్మినీరెడ్డి బీజేపీలో చేరినట్లు తెలుస్తోంది. పద్మినీరెడ్డి సంగారెడ్డి లేదా మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

గత రెండు దఫాలుగా రాజకీయాల్లోకి వచ్చేందుకు పద్మినీరెడ్డి ఆసక్తి కనబరిచారు. దామోదర రాజనర్సింహకు ఆంధోల్ టికెట్ కేటాయించడంతో.. ఆయన భార్యకు సంగారెడ్డి టికెట్ ఇచ్చేందుకు ఆ పార్టీ నిరాకరించింది. సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి మాత్రమే సమర్థ అభ్యర్థిగా కాంగ్రెస్ భావించింది. ఈసారి కూడా ఆయనకే టికెట్ కేటాయించింది. దీంతో సంగారెడ్డి నుంచి పోటీ చేయాలనే ధృఢ నిశ్చయంతో ఉన్న పద్మినీరెడ్డి… కాంగ్రెస్ నుంచి అలాంటి అవకాశం లేకపోవడంతో బీజేపీ తీర్థం పుచ్చుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ తనకు టికెట్ ఇస్తుందనే ఆశాభావంలో పద్మినీరెడ్డి ఉన్నట్లు సమాచారం. బీజేపీ కూడా సంగారెడ్డి లేదా మెదక్ నుంచి పోటీ చేసేందుకు పద్మినీరెడ్డికి సానుకూలంగా హామీ ఇచ్చిన నేపథ్యంలోనే ఆమె ఆ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దామోదర రాజనర్సింహ అనుమతితోనే పద్మినీరెడ్డి బీజేపీలో చేరారా? లేదా? అనే అంశంపై స్పష్టత లేదు.

Facebook Comments