ఏన్టీఆర్ పై షాకింగ్ ఫ్లెక్సి… టీడీపీలో కలకలం

ఏపీలో  ఇప్పుడు టీడీపీ అభిమానులు పెట్టీన ఫ్లెక్సి ఇప్పుడు రచ్చకెక్కింది.సంక్రాంతిని తెలుగు ప్రజలు అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. భోగితో మొదలై కనుమతో ముగిసే ఈ మూడు రోజుల పండుగ సందర్భంగా ఏపీ రాజకీయాలు బాగానే వేడెక్కాయి. ఓ వైపు కోడి పందేలతో ఉభగ గోదావరి జిల్లాలతో పాటు కోస్తాంధ్ర హోరెత్తిపోతుండగా… అదే ప్రాంతంలోని ప్రకాశం జిల్లాలో వెలసిన ఓ ఫ్లెక్సీ విపక్ష టీడీపీలో పెద్ద చర్చకే తెర తీసిందని చెప్పాలి. టీడీపీ తొలి తరం నేత, చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణ అనుచర వర్గం ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీని చూస్తే నిజంగానే టీడీపీలో పెద్ద రచ్చ ఖాయమన్న వాదన వినిపిస్తోంది.

 

అమితాసక్తి రేకెత్తిస్తున్న ఈ ఫ్లెక్సీలో అసలు ఏముందన్న విషయానికి వస్తే… టాలీవుడ్ యంగ్ టైగర్, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు జూనియర్ ఎన్టీఆర్ ఫొటో ఓ రేంజిలో సైజులో కనిపిస్తుండగా… ఆ ఫొటో కింద ‘రాబోయే కాలానికి కాబోయే సీఎం… 2024 నెక్ట్స్ ఏపీ సీఎం’ అంటూ తాటికాయలంత అక్షరాలతో ఆసక్తికర పదాలున్నాయి. అంతేకాదండోయ్… సదరు ఫ్లెక్సీలో పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్, కరణం ఫొటోలతో పాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేశ్ కూడా ఉన్నారు. అయితే పార్టీ అధినేతగా ఉన్న చంద్రబాబు ఫొటో ఎంత వెతికినా కూడా అందులో కనిపించలేదు.మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలు కాగా… వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసే దిశగా పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ప్రస్తుతం కొనసాగుతున్న నాయకత్వాన్ని మారిస్తే తప్పించి,… పార్టీని బతికించుకోలేమన్న వాదనలూ లేకపోలేదు. ఇదే జరిగితే… చంద్రబాబు తర్వాత పార్టీ అధ్యక్షుడిగా ఎవరు ఉండాలన్న దిశగా చర్చలూ జరుగుతున్నాయి.

 

ఈ చర్చలన్నింటిలో అందరి నోటా జూనియర్ ఎన్టీఆర్ పేరే వినిపిస్తోంది. అయితే ఎప్పటికప్పుడు ఈ చర్చ జరగడం, ఆ వెంటనే అందరూ దానిని వదిలేయడం జరుగుతోంది. అయితే ఎప్పుడు చర్చ జరిగినా… జూనియర్ ఎన్టీఆర్ పేరే వినిపించడం, ఇప్పుడు ఏకంగా ఏపీకి కాబోయే సీఎం అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు కావడం నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది.