కేసీఆర్ కు అస్వస్థత… హూటాహూటిన హాస్పటల్ కు…

తెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ను హైదరాబాద్ సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రికి తరలించారు. తీవ్ర జ్వరంతో కేసీఆర్ బాధపడుతున్నారు. యశోదా ఆస్పత్రిలోని ప్రత్యేక వైద్యుల బృందం ముఖ్యమంత్రికి చికిత్స అందిస్తోంది. అన్ని రకాల వైద్య పరీక్షలను సీఎం కేసీఆర్‌కు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పినట్టు పలు న్యూస్ ఛానళ్లు ప్రసారం చేశాయి. సుమారు 9 గంటల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను యశోదా ఆస్పత్రికి తీసుకొచ్చారు. కేసీఆర్‌ వెంట ఆయన సతీమణి కూడా ఆస్పత్రికి వచ్చారు. సుమారు గంటపాటు ఆయనకు పలు రకాల టెస్టులు నిర్వహించినట్టు తెలిసింది. యశోదా ఆస్పత్రిలోని 9వ ఫ్లోర్‌లో ముఖ్యమంత్రికి చికిత్స చేస్తున్నట్టు సమాచారం. టెస్టుల రిపోర్టులు వచ్చే వరకు ముఖ్యమంత్రి ఆస్పత్రిలోనే ఉంటారా? లేకపోతే కొంచెం దూరంలోనే ఉండే ప్రగతిభవన్‌కు వెళ్లి రేపు ఉదయం రిపోర్టులు వచ్చిన తర్వాత ఆస్పత్రికి వస్తారా? అనేది ఇంకా తెలియలేదు.

 

ఈనెల 13వ తేదీన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ కలుసుకున్నారు. ఆ భేటీ తర్వాత సంక్రాంతి పండుగ కోసం కేసీఆర్ ఎర్రవెల్లి వెళ్లిపోయారు. అయితే, అక్కడ రెండు రోజుల నుంచి జ్వరంగా ఉండడంతో ఈ రోజు సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్ వచ్చారు. అయితే, రాత్రి సమయంలో శరీర ఉష్ణోగ్రత బాగా పెరగడంతో పాటు, హైబీపీ కూడా వచ్చినట్టు తెలిసింది. దీంతో కుటుంసభ్యులు వెంటనే ముఖ్యమంత్రిని ఆస్పత్రికి తరలించారు.కేసీఆర్ అనారోగ్యానికి గురయ్యారని, ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లారని తెలియడంతో టీఆర్ఎస్ నేతలు హుటాహుటిన యశోదా ఆస్పత్రికి వచ్చారు. హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, మరికొందరు టీఆర్ఎస్ నేతలు, శ్రేణులు ఆస్పత్రి వద్దకు వచ్చారు.తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ప్రచారానికి దూరంగా ఉన్నారు. కనీసం ఎన్నికల ప్రచారం ముగియడానికి ముందు ఓ ప్రెస్ మీట్ అయినా నిర్వహిస్తారని టీఆర్ఎస్ వర్గాలు భావించాయి. అయితే, రెండు మూడు రోజుల నుంచి ఆయనకు అనారోగ్యంగా ఉండడంతో ఆ ప్రెస్ మీట్‌ కూడా నిర్వహించలేదు.