తెలంగాణ ఎన్నికల ప్రచారంలో జూ. ఎన్టీఆర్..?

రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేం అన్నదానికి అనేక సంఘటనలు ఉదాహరణగా నిలుస్తుంటాయి. దేశంలో ఎక్కడా లేని ఎన్నికల హడావుడి తెలంగాణాలో కనిపిస్తోంది. అసెంబ్లీని రద్దు చేసి కేసీఆర్ ముందడుగు వేయడంతో అన్ని పార్టీల్లోనూ ఎన్నికల వేడి మొదలయ్యింది. ఏ పార్టీతో ఏ పార్టీ పొత్తు పెట్టుకుంటుంది..? ఎన్నికల వరకు ఎవరెవరు కలిసి ఉంటారు. ఏ పార్టీ మేనిఫెస్టో ఏంటి..? వలసలు, అలకలు, రెబెల్స్ ఇలా సవాలక్ష ఇబ్బందులు అన్ని పార్టీలకు ఉంటాయి. ఇవన్నీ ఒక్కొక్కటిగా అధిగమించుకుంటూ పార్టీలు ముందుకు వెళ్ళాలి.

ఇక టీ.టీడీపీ కూడా టీఆర్‌ఎస్ ఓటమే లక్ష్యంగా పొత్తుల రాజకీయానికి తెర లేపింది. కాంగ్రెస్‌తో పొత్తుకు కూడా టీటీడీపీ సిద్ధం అవుతోంది. ఇప్పటికే సీపీఐతో పొత్తు ఖరారు చేసుకుంది. టీఆర్‌ఎస్ వ్యతిరేక శక్తులన్నింటినీ కూడగట్టి మహా కూటమిగా బరిలోకి దిగాలని టీటీడీపీ వ్యూహాలు రచిస్తోంది. ఇక బీజేపీ కూడా ఈ నెల 15న అమిత్ షా తెలంగాణ పర్యటనతో స్పీడ్ పెంచాలని చూస్తోంది.ఈ సంగతులన్నీ ఎప్పుడూ రొటీన్ గా ఉండే అంశాలే అయినా .. ఇప్పుడు టి.టీడీపీలో కొత్త జోష్ కనిపిస్తోంది. ఎన్నికల్లో తమ ప్రభావం గట్టిగా ఉండే అవకాశాలపై లెక్కలు వేసుకుంటోంది. దీనికి కారణం జూనియర్ ఎన్టీఆర్. 2009 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరించిన జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ తరపున ప్రచారం చేసే అంశంపై టి.టీడీపీ భారీగా ఆశలు పెట్టుకుంది. అయితే కొద్ది రోజుల క్రితం నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడం.. ఆ విషయంలో జూనియర్ ఇంకా కోలుకోకపోవడంతో ప్రస్తుతం తెలంగాణాలో జరగబోయే ఎన్నికల ప్రచారానికి ఆయన వస్తాడా రాడా అనే అనుమానం అందరిలోనూ ఉంది.

తండ్రి చనిపోయిన బాధలో ఉన్న సమయంలో కష్టకాలంలో అండగా నిలిచిన చంద్రబాబు కోరితే జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి వచ్చే అవకాశాలను కూడా ఉన్నట్టు తెలంగాణ టీడీపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. అయితే జూనియర్ విషయంలో ఏదైనా క్లారిటీ రావాలంటే చంద్రబాబు ప్రకటన చేయాల్సి ఉంటుంది. అయితే తెలంగాణ ఎన్నికల విషయంలో ఆ ప్రాంతా టీడీపీ నాయకులకు బాబు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో పాటు మొత్తం బాధ్యత అంతా వారి మీదే పెట్టెయ్యడంతో ఏ విషయమైనా ఆ ప్రాంత నాయకులే తేల్చుకోవాల్సిన పరిస్థితి. అయితే తెలంగాణాలో పార్టీ మళ్లీ పుంజుకునేలా జూనియర్ తపాకుండా ప్రచారానికి వస్తాడని నాయకులూ నమ్మకం పెట్టుకున్నారు. అయితే ఎన్టీఆర్ మనసులో ఏముందో ఇంకా బయటకి రాలేదు.

Facebook Comments