తెలంగాణలో మీడీయా ఇంత దారుణమా..? బానిసలకంటే దారుణంగా..?

ముల్లుగర్రతో మీడియాను ఆడిస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. టిక్కెట్లు ఎగ్గొట్టాలనుకునే రాజయ్య లాంటి వాళ్లపై దుష్ప్రచారం చేసే బాధ్యత దగ్గర్నుంచి… తన పార్టీ గెలవబోతోందని ప్రచారం చేయించుకునే వరకూ.. మీడియాను కేసీఆర్ విచ్చలవిడిగా వాడేసుకుంటున్నారు. ఆయన కన్నెర్ర చేస్తే ఎక్కడ తమ గుడారాలు ఊడిపోతాయో అనుకుంటున్న మీడియా.. అసలు అసెంబ్లీని ఎందుకు రద్దు చేశారో కారణాలు మాత్రం విశ్లేషించలేకపోతోంది. కానీ ఆయన పెద్ద వీరుడంటూ.. సినిమా పేర్లన్నీ పెట్టి కేసీఆర్‌ను పొగడ్తల్లో ముంచేస్తోంది. దూకుడు, ఒక్కడు, ఆగడు, ఖలేజా ఎన్నెన్ని పేర్ల తోనో ఆయన సాహసాన్ని పత్రికల పేజీల్లో పరిచేసి, చానళ్ల స్క్రీన్ల మీద పులిమేసి భయం భక్తిని చాటుకుంటున్నాయి.

తెలంగాణా భవన్‌లో విలేఖరులు అడి గిన ఒక్క ప్రశ్నకు కూడా కేసీఆర్‌ సమాధానం చెప్ప కుండా కసురుకుని, హేళన చేసి, ఇవేం ప్రశ్నలయ్యా అని కోప్పడ్దారు. నిజానికి అంతా డ్రామాలా సాగిపోయిన వ్యవహారంలో గవర్నర్ పై , ఈసీ అనుమానాలు రాకుండా ఎలా ఉంటాయి. ఆయన చెపుతున్నట్టు రాష్ట్రం ప్రగతి పథంలో పరుగులు పెడుతూంటే ఇప్పుడే ఎందుకు ఎన్నికలకు వెళ్ళడం? కేసీఆర్ను ప్రసన్నం చేసుకోడంలో తరించిపోతున్న మీడియాకు మాత్రం ఇవన్నీ ప్రశ్నలుగా అనిపించలేదు. తెలంగాణాలో జరుగుతున్న వ్యవహారాలు సోషల్ మీడియాలో మాత్రమే బయటకు వస్తున్నాయి. కానీ… అసలు మీడియాలో మాత్రం చెప్పడానికి భయపడిపోతున్నారు.

తెలంగాణ మీడియా మొత్తం సర్కారీ గజెట్‌గా మారిపోయిందనడంలో సందేహం లేదు. 2014లో కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన కొద్ది మాసాలకే మీడియాను పది కిలోమీటర్ల లోతున బొంద పెడతానన్న నాటి నుంచీ మొన్న ఆయన అసెంబ్లీని రద్దు చేసే వరకూ మీడియా వ్యవహరించిన తీరు చూస్తే మీడియా ఆయన నియంత్రణలోకి వెళ్లిపోయిందని అర్థమౌతుంది. వాస్తవాలకు రంగుల పరదాలు కప్పి మీడియా ప్రజలను ఎలా మోసం చేస్తోందో మొన్నటికి మొన్న ఓ మీడియా సంస్థ అధిపతి రాసిన సంపాదకీయ వ్యాసం మచ్చు తునక. ఇక తెలంగాణలో ప్రజలకు సోషల్ మీడియానే దిక్కు. ఆ విషయంలో ప్రజలకు కూడా క్లారిటీ ఉంది.

Facebook Comments