థర్డ్ ఫ్రంట్ కన్వీనర్ గా చంద్రబాబు… దేశ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్న బాబు

జాతీయ రాజ‌కీయాల్లో ఆయన చక్రం తిప్పగలరు. ఎలాంటి సమస్యనైనా పరిష్కరించే రాజకీయ నైపుణ్యం ఉన్న నాయకుడాయన .చాలా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిగా ఆచి తూచి వ్యవహరించే చంద్రబాబు అంటే దేశలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నాయకులకు ఒకింత అభిమానమే. ఎవరితోనూ పంచాయితీలు పెట్టుకోని ఆయనంటే అందరికీ ఇష్టమే. జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పిన సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు గతంలో నేషనల్‌ ఫ్రంట్ ,యునైటెడ్‌ ఫ్రంట్‌లో ప్ర‌ముఖ పాత్ర పోషించారు.

జాతీయ రాజ‌కీయాలు చంద్ర‌బాబుకు ఇప్పుడు కొత్తేమీ కాదు. గతంలోనూ ఆయన జాతీయ నాయకుడే.. ఇప్పుడు ఇంకా ఏపీ పరిస్థితి కి బాధలో ఉన్న ఆయన జాతీయ రాజకీయాల్లో కీలక వ్యక్తిగా మారబోతున్నారు. విభ‌జ‌న‌తో తీవ్రంగా న‌ష్ట‌పోయిన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు న్యాయం చేస్తామ‌ని, ఆదుకుంటామ‌ని బీజేపీ చెప్ప‌డంతో, వారి మాట‌ల‌ను న‌మ్మి రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం గ‌త ఎన్నిక‌ల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న చంద్ర‌బాబు, ఎన్డీయే కూట‌మిలో భాగ‌స్వామి అయ్యారు. ఎన్డీయే క‌న్వీన‌ర్‌గా కూడా చంద్ర‌బాబు ప‌నిచేశారు. కానీ నాలుగేళ్లు పూర్త‌యినా ఏపీకి ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌కుండా కేంద్ర ప్ర‌భుత్వం మోసం చేయ‌డంతో.. ఎన్టీయే నుంచి బ‌య‌ట‌కొచ్చిన టీడీపీ, మోదీ చేసిన న‌మ్మ‌క‌ ద్రోహంపై పోరాటం చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో గద్దె దింపాలని యోచిస్తుంది.
రానున్న ఎన్నిక‌ల్లో కేంద్రంలో మోదీని గ‌ద్దె దించేందుకు జాతీయ రాజ‌కీయాల్లో మ‌రోసారి క్రియాశీల‌క పాత్ర పోషించాల‌ని నిర్ణ‌యించుకున్నారు బాబు .ఇక దేశ‌వ్యాప్తంగా కూడా మోదీ వ్య‌తిరేక ప‌క్షాల‌న్నీ ఏక‌తాటిపైకి వ‌స్తున్న నేప‌థ్యంలో జాతీయ రాజ‌కీయాల్లో వారితో క‌లిసి న‌డ‌వాల‌ని ఇప్ప‌టికే చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన టీడీపీ పార్ల‌మెంట‌రీ స‌మావేశంలో కూడా చంద్ర‌బాబు ఇదే విష‌యాన్ని చెప్పారు. మోదీకి వ్య‌తిరేకంగా క‌లిసి వ‌చ్చే అన్ని పార్టీల‌తో టీడీపీ క‌లిసి ప‌నిచేస్తుందని ప్ర‌క‌టించారు. దీంతో జాతీయ రాజ‌కీయాల్లో చంద్ర‌బాబు మ‌రోసారి చ‌క్రం తిప్ప‌బోతున్నార‌నే దానిపై క్లారిటీ వ‌చ్చింది. అందుకు తాజాగా మమత కోల్ కత్తాలో తలపెట్టిన ర్యాలీలో పాల్గొనటానికి బాబు కి పంపిన ఆహ్వానమే ఒక కారణంగా చెప్పవచ్చు.

2019 లోక్‌స‌భ ఎన్నిక‌లు ముంచుకు వ‌స్తున్న నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా మోదీ వ్య‌తిరేక ప‌క్షాల‌న్నీ ఒకే వేదిక‌పైకి వ‌చ్చేందుకు సిద్ద‌మ‌య్యాయి.ఆ దిశగా ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ స‌న్నాహ‌లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే జ‌న‌వ‌రి 19న క‌ల‌క‌త్తాలో మోదీ వ్య‌తిరేక ప‌క్షాల‌తో భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించాల‌ని భావించిన ఆమె, బీజేపీ యేత‌ర పార్టీల‌న్నీటినీ ఆహ్వానిస్తున్నారు. ఈ భారీ బ‌హిరంగ స‌భ‌కు రావాల్సిందిగా ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుకు, మ‌మ‌తా బెన‌ర్జీ లేఖ రాశారు. అయితే జనవరి 19న‌ కలకత్తా లో జరిగే ఈ భారీ బహిరంగ సభలో థర్డ్ ఫ్రంట్ కన్వీనర్ గా చంద్రబాబు నాయుడును ప్రకటించేందుకు మమతా బెనర్జీ రంగం సిద్ధం చేసిన‌ట్లు తెలుస్తోంది.గతంలో రెండుసార్లు థర్డ్ ఫ్రంట్ కన్వీనర్‌గా ప‌నిచేసిన అనుభవం ఉన్నందున జాతీయ నాయ‌కులంద‌రితో చంద్ర‌బాబుకు మంచి సంబంధాలు ఉన్నాయి. మోదీకి వ్య‌తిరేకంగా ప్ర‌తిప‌క్షాల‌న్నిటినీ ఏక‌తాటిపైకి తీసుకొచ్చేందుకు చంద్ర‌బాబు ఇప్ప‌టికే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దాంతో చంద్రబాబును థ‌ర్డ్ ఫ్రంట్ క‌న్వీన‌ర్‌గా ప్రకటించేందుకు అన్ని పార్టీల నాయకులతో చర్చలు జరుపుతున్నారు మమతా .. జాతీయ రాజ‌కీయాల్లో చంద్ర‌బాబుకు ఉన్న అనుభ‌వం దృష్టా అన్ని పార్టీలు ఈ ప్ర‌తిపాద‌న‌కు ఒకే చెప్ప‌డం ఖాయంగా కనిపిస్తుంది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో థ‌ర్డ్ ఫ్రంట్ క‌న్వీన‌ర్‌గా జాతీయ రాజ‌కీయాల్లో చంద్ర‌బాబు చక్రం తిప్పబోతున్నారు. ఏపీ కి అన్యాయం చేసిన మోడీపై థర్డ్ ఫ్రంట్ ద్వారా పోరాటం చెయ్యబోతున్నారు.

Facebook Comments