టీఆర్ఎస్ కొత్త అనుబంధ సంఘం చాలా పవర్‌ఫుల్..! ఖాకీని గులాబీగా మార్చేసుకుంటున్నారా..?

తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి అనుబంధ సంఘంగా పోలీసులు మారిపోయారా..?. ప్రజలను రక్షించాల్సిన పోలీసులు.. తమ అధికారాల్ని అడ్డం పెట్టుకుని…టీఆర్ఎస్ కు బలంగా పోటీ ఇస్తున్న నేతలపై.. అక్రమ కేసులతో విరుచుకుపడటం చూస్తూంటే ఇది నిజం అనిపించక మానదు. నిన్నటికి నిన్న 14 ఏళ్ల కిందట కేసును బయటకు తీసిన పోలీసులు.. జగ్గారెడ్డిని గుట్టుచప్పుడు కాకుడా అరెస్ట్ చేశారు. ఆయనపై ఏవో కేసులు పెట్టి లోపలేసేశారు. సంగారెడ్డిలో మైనార్టీ సభ నిర్వహించడానికి జగ్గారెడ్డి అన్ని ఏర్పాట్లు చేశారు. దానికి గులాంనబీ ఆజాద్ వస్తున్నారు ఈ సభను భగ్నం చేయడానికి పాత కేసను బయటకు తీశారు.

ఇప్పుడెందుకు తీశారు అంటే.. ఎవరో ఫిర్యాదు చేశారని పోలీసులు చెప్పారు. కానీ ఎవరూ ఫిర్యాదు చేయలేదు. వస్తే గిస్తే ప్రగతి భవన్ ను ఆదేశాలు వచ్చి ఉంటాయి. అలా పోలీసులు టీఆర్ఎస్ అనుబంధ సంఘంగా మారిపోయి… జగ్గారెడ్డిని జైల్లో పెట్టి స్వాభక్తిని చాటుకున్నారు . ఆ వెంటనే భూపాల పల్లిలో టీఆర్ఎస్ పతనాన్ని శాసిస్తాడని అనుకుంటున్న గండ్ర వెంకటరమణారెడ్డి పోలీసులు మరో కేసు పెట్టారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా శాయంపేట పోలీస్‌స్టేషన్‌లో గండ్రపై కేసు నమోదైంది. స్టోన్‌ క్రషర్‌ యాజమాని రవీందర్‌రావును తుపాకీతో బెదిరించాడనే ఆరోపణలు. నిజానికి గండ్ర సోదరుడితో ఆ స్టోన్ క్రషర్ యజమానికి వ్యాపార లావాదేవీల్లో తేడాలొచ్చాయి. అది అడ్డం పెట్టుకుని టీఆర్ఎస్ అనుబంధ సంఘం కేసులు నమోదు చేసింది. ఇదొక్కటే కాదు.. గతంలో గండ్రపై ఓ మహిళను ప్రయోగించి లైంగిక వేధింపుల కేసు కూడా పెట్టాలని ప్రయత్నించారు. అడ్డం తిరిగే సరికి సైలెంటయ్యారు.

ఇంతా చేసి రేవంత్ రెడ్డిని వదిలేస్తే.. టీఆర్ఎస్ అనుబంధ సంఘం సిన్సియార్టీపై అనుమానాలు రావు. అందుకే.. రేవంత్ పై కూడా ఓ పాత కేసును బయటకు తీశారు. రేవంత్‌రెడ్డికి జూబ్లీహిల్స్‌ పోలీసుల నోటీసులు పంపారు. ఏం కేసు అటే.. హౌసింగ్‌ సొసైటీ కేసులో రేవంత్‌రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయట. నకిలీ ధ్రువీకరణ పత్రాలతో ఇళ్ల స్థలాలు అమ్మారట. ఎన్నికల ప్రచారంలో ఉన్నానని, కొంత సమయం కావాలని… రేవంత్‌రెడ్డి పోలీసులకు లేఖ రాశారు. కానీ దీన్ని ఇలా వదిలిస్తే.. వాళ్లు అనుబందం సంఘం కాకుండా పోతారు. ముందు ముందు మరిన్ని కేసులు క్యూలో ఉంటాయి. ఇలా ఎంత మందిని అని కేసుల్లో పెట్టి గెలుద్దామనుకుంటారు..? పోలీసులకైనా బుద్ది ఉండొద్దా..?

Facebook Comments