వారసుల రాజ‌కీయాల‌తో ముద్దుకృష్ణ‌మ ప‌రువు పాయే..!!

సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం, వివాద ర‌హిత వ్య‌క్తిత్వం.. ప్ర‌త్య‌ర్థిని సైతం మెప్పించ‌గ‌ల మేధావి. పార్టీ విధివిధానాలు, క్ర‌మ‌శిక్ష‌ణే ల‌క్ష్మ‌ణ రేఖ‌. ఇలా త‌న జీవితం మొత్తాన్ని ఆద‌ర్శంగా గ‌డిచిన‌, ప‌దిమందికీ ఆద‌ర్శంగా నిలిచిన రాజ‌కీయ ధీరోదాత్తుడు చిత్తూరు జిల్లా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు. సుదీర్ఘ రాజ‌కీయ జీవితంలో ఆయ‌న సంపాయించింది ఏమైనా ఉంటే.. ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ‌, పార్టీలో అభిమానం. ఈ రెండే కీల‌కంగా ఆయ‌న ముందుకు సాగారు. త‌న జీవితం మొత్తంలో ఎక్క‌డా అసంతృప్తి అనేది బ‌య‌ట‌కు రానీయ‌కుండా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ప‌ద‌వులతో.. అధిష్టానం ఇచ్చిన గౌర‌వంతో నెట్టుకొచ్చారు. మ‌ధ్యలో ఒక‌సారి కాంగ్రెస్‌లోకి వెళ్లినా.. ఆయ‌న మ‌ళ్లీ టీడీపీలోకే వ‌చ్చేశారు. అన్న‌గారు ఎన్టీఆర్ పిలుపుతో లెక్చ‌ర‌ర్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. మంత్రిగా కూడా ప‌నిచేశారు. ఎక్క‌డా వివాదాల‌కు తావు లేకుండా ఆయ‌న ముందుకు సాగారు.

గ‌త 2014 ఎన్నిక‌ల్లో ఆయ‌న న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేశారు. అదే ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి బ‌రిలోకి దిగిన ఆర్కే రోజా పై కొద్దిపాటి తేడాతో విజ‌యానికి దూర‌మ‌య్యారు. అయినా కూడా ఆయ‌న ప్ర‌జ‌ల్లోనే ఉండేవారు. నిత్యం ప్ర‌జ‌ల్లోనే తిరిగేవారు. ఆ త‌ర్వాత చంద్ర‌బాబు ఆయ‌న‌ను ఎమ్మె ల్సీ ప‌ద‌వితో గౌర‌వించారు. అప్పుడు కూడా ప్ర‌భుత్వం నుంచి నిధులు స‌మీక‌రించి న‌గ‌రి అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని ఏక‌తాటిపై న‌డిపించారు. ఎక్క‌డా అసంతృప్తి లేకుండా చంద్ర‌బాబు పిలుపునందుకుని ప్ర‌తి కార్య‌క్ర‌మాన్ని ఆయన విజ‌య‌వంతంగా నిర్వ‌హించారు. అయితే, అనూహ్యంగా అయ‌న అనారోగ్య కార‌ణాల‌తో మృతి చెందారు. దీంతో అటు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఖాళీ అయింది. అదేస‌మయంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో న‌గ‌రి నుంచి ఎవ‌రు పోటీ చేస్తార‌నే విష‌యం కూడా తెర‌మీదికి వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే సాధార‌ణంగా రాజ‌కీయాల్లో జ‌రుగుతున్న విధంగానే గాలివార‌సులుగా ఇద్ద‌రు తెర‌మీదికి వ‌చ్చారు. వాస్త‌వానికి గాలి జీవించి ఉన్న రోజుల్లోనే ఆయ‌న రాజ‌కీయ వార‌సుడిగా భాను ప్ర‌కాష్‌ను నియోజ‌క‌వ‌ర్గానికి ప‌రిచ‌యం చేశారు. దీంతో ఆయ‌న మ‌ర‌ణం త‌ర్వాత భాను రాజ‌కీయంగా ఎదుగుతార‌ని గాలి అభిమానులు భావించారు. అయితే, గాలిలో ఉన్న నైతిక‌త ఆయ‌న వారసుల్లో మ‌చ్చుకైనా క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అటు ఎమ్మెల్సీ, ఇటు ఎమ్మెల్యే టికెట్ కోసం ఇద్ద‌రు కుమారులు రోడ్డున ప‌డ్డారు. భాను ప్ర‌కాష్‌, జ‌గ‌దీష్ ఇద్ద‌రూ కూడా `నాకంటే నాకే ద‌క్కాలి!` అని ప‌ద‌వుల విష‌యంలో క‌య్యానికి దిగ‌డం, భాను ఏకంగా త‌న ఆధిపత్యాన్ని ప్ర‌ద‌ర్శించ‌డం కోసం.. ర్యాలీలు చేయ‌డం వంటివి గాలి కుటుంబం ప‌రువును రోడ్డున ప‌డేశాయి. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు మ‌ధ్యే మార్గంగా గాలి స‌తీమ‌ణి స‌ర‌స్వ‌త‌మ్మ‌ను పిలిచి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు.

ఇక‌, ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ విష‌యం తెర‌మీదికి వ‌చ్చింది. ఇప్పుడు కూడా గాలి కుమారులు ఇద్ద‌రూ కొట్టుకుంటున్నారు. గ‌తంలో ఒక‌సారి చంద్ర‌బాబు వీరికి క్లాస్ ఇచ్చారు. మీ నాన్న ఎంత గౌర‌వంగా బ‌తికారో.. ఆద‌ర్శంగా బతికారో.. మీకూ తెలుసు. దానిని నిల‌బెట్టేందుకు కృషి చేయండి! అని ఆయ‌న వారికి సూచించారు. అయినా కూడా ఈ ఇద్ద‌రూ ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ కోసం మ‌రోసారి రోడ్డున ప‌డ్డారు దీంతో చిర్రెత్తుకొచ్చిన చంద్ర‌బాబు.. ఇద్దరిలో ఎవరు ఇన్‌చార్జ్‌గా ఉంటారో రెండు రోజుల్లోగా చెప్పాలన్నారు. లేదంటే మరొకరికి ఆ బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. ఇన్‌చార్జ్ పదవి కోసం ముద్దుకృష్ణమ కుమారులు జగదీష్, భాను పట్టుబడుతున్నారు. దీంతో వీరిని పిలిపించుకొని మాట్లాడిన చంద్రబాబు.. వారిద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఈ ప్ర‌య‌త్నాలు ఏమేర‌కు ఫ‌లిస్తాయో చూడాలి. ఏదేమైనా గాలి ముద్దుకృష్ణ‌మ ప‌రువును మాత్రం ఈ ఇద్ద‌రు కుమారులు రోడ్డున ప‌డేస్తున్నార‌నేది వాస్త‌వం.

Facebook Comments