జగన్ కి ముందుంది అసలైన సమస్య..??

జగన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆర్నెళ్ల కాలంలో విద్యుత్ కొరత, తీవ్రమైన ఇసుక కొరత రాష్ట్రాన్ని పట్టి పీడించడంతో జనం అల్లాడే పరిస్థితి ఏర్పడింది. వర్షాకాలం రావడంతో కరెంటు కోతల సమస్య నుంచి బయటపడినా ఇసుక కొరత మాత్రం ఇంకా వేధిస్తోంది. అయితే, మరో నాలుగు నెలలు అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి దాటితే జగన్ ప్రభుత్వానికి చెమటలు పట్టడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.ఫిబ్రవరి తరువాత వాతావరణం మారుతుందని.. వేసవి మొదలై జల విద్యుత్ తగ్గిపోతుందని.. అదేసమయంలో గృహ, వ్యవసాయ వినియోగం కూడా భారీగా పెరుగుతుందని.. అప్పుడు సరిపడా విద్యుత్ ఇవ్వకపోతే జనం ఇబ్బంది పడి ప్రభుత్వం ఇరకాటంలో పడడం ఖాయమంటున్నారు.

అయితే, ఫిబ్రవరి దాటాక ఇసుక కొరత తీరుతుందని.. అది భవన నిర్మాణాలను వేగవంతం చేయడం వల్ల విద్యుత్ అవసరం మరింత పెరుగుతుందని చెబుతున్నారు. విద్యుత్ కొరతను ప్రబుత్వం పరిష్కరించలేకపోతే విపక్షాల చేతికి ఆయుధం దొరికినట్లేనని చెబుతున్నారు.ఇప్పటి నుంచి ఏర్పాట్లు చేసుకోకపోతే దెబ్బతినడం ఖాయమంటున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు బొగ్గు సరఫరా నిల్చిపోయింది. ఈ బకాయిల భారం పెరిగింది. చెల్లించలేక ప్రభుత్వ సంస్థలు చేతులెత్తేశాయి. ఎన్‌టిపిసి గతంలో సరఫరా చేసిన విద్యుత్‌ బకాయిల పట్ల కఠినంగా ఉంది. వీటిని చెల్లిస్తే తప్ప రాష్ట్రానికి తిరిగి సరఫరా చేసే పరిస్థితి లేదు. సంప్రదాయేతర వనరుల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తికుద్దేశించిన గాలిమరలు, సౌర విద్యుత్‌ ఉత్పాధక సంస్థల్తో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల్ని జగన్‌ పున:సమీక్ష పేరిట రద్దు చేశారు.దీంతో ఇప్పుడందుబాటులో ఉన్న విద్యుత్‌కు అదనంగా ఒక్క యూనిట్‌ కూడా సమకూర్చుకోగలిగే అవకాశాలు లేవు.పోనీ పొరుగు రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలన్నా కూడా ఖజనా పరిస్థితీ అంతంతమాత్రంగా ఉంది. ఈ పరిస్థితుల్లో జగన్ ఇప్పటి నుంచే విద్యుత్ విషయంలో దృష్టి పెట్టకపోతే తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకోక తప్పదని అంచనా వేస్తున్నారు.