వైసీపీ, బీజేపీ అతి తెలివి..? చంద్రబాబును లాగేద్దామనేనా..?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. జనవరిలో ఎన్నికలు వస్తాయని పదే పదే ప్రచారం చేయడానికి కారణం ఏమిటన్నదానిపై… తెలుగుదేశం పార్టీలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఓ వైపు జగన్ జనవరిలో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు వస్తాయని చెప్పడం.. అదే సమయంలో.. బీజేపీకి బాకా ఉదే చానల్‌గా పేరున్న రిపబ్లిక్‌ టీవీలో కథనం ప్రసారం చేయడం వెనుక… రాజకీయ వ్యూహం ఉందన్న అనుమానాలు టీడీపీలో ప్రారంభమయ్యాయి. అదే సమయంలో రెండు రోజుల నుంచి అటు తెలంగాణ బీజేపీ నేత కిషన్ రెడ్డి, ఇటు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ.. చంద్రబాబును దమ్ముంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని సవాళ్లు చేస్తూండటాన్ని కూడా వీరు గుర్తు చేస్తున్నారు. గన్నవరంలోని మేథాటవర్స్‌లో… హెచ్‌సీఎల్ స్టేట్ స్ట్రీట్ కంపెనీని ప్రారంభించిన లోకేష్‌ .. ముందస్తు ఎన్నికలపై జగన్ చేసిన వ్యాఖ్యలను కొట్టి పడేశారు.

జగన్‌తో పాటు బీజేపీ కూడా.. ఏపీలో ముందస్తు ఎన్నికలపై ప్రచారం ప్రారంభించడానికి.. ఉభయులకూ ఉపయోగపరమైన రాజకీయ వ్యూహం ఉందన్న విశ్లేషణ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం బీజేపీకి తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో వైసీపీ రహస్య మిత్రులు. ఈ పార్టీలు పార్లమెంట్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలంటే… లోక్‌సభ ఎన్నికల సమయానికి ఆయా పార్టీలు అధికారంలో ఉండాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా.. కేసీఆర్‌ను ముందస్తుకు ఒప్పించారు. ఆ ప్రకారం ఎన్నికలు రాబోతున్నాయి.

కానీ ఏపీలో మాత్రం చంద్రబాబు ముందస్తుకు వెళ్లేది లేదంటున్నారు. నిజానికి గతంలో చంద్రబాబు ముందస్తుకు సిద్ధమన్నారు. అయితే పార్లమెంట్‌తో పాటు అసెంబ్లీకి జరిగితే సిద్ధమన్నారు. విడిగా అసెంబ్లీకి ముందస్తుకు పోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు అది చూపించి చంద్రబాబుపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారని భావిస్తున్నారు. అయితే చంద్రబాబు ఇలాంటి ఒత్తిళ్లకు లొంగేరకం కాదని ఈ పార్టీల నేతలకు బాగా తెలుసు. అయినా సరే… ఏదో ఓ రాయి వేసి చూద్దామన్నట్లుగా.. ప్రయత్నాలు చేస్తున్నారు. పిచ్చి కాకపోతే.. తెలంగాణలో కేసీఆర్ ముందస్తుకు పోయి ఉన్న అధికారాన్ని పోగొట్టుకుంటున్నారు. ముందస్తుకు ఎందుకు వెళ్లాల్సి వస్తుందనే కారణాలు చెప్పలేకపోవడమే .. కేసీఆర్ ఓడిపోవడానికి ప్రధాన కారణంగా మారుతోంది.

Facebook Comments